Korralu: ఐదేళ్ల లోపు చిన్నారులకు కొర్రలతో పోషకాహార లోపానికి చెక్!
ఐదేళ్ల లోపు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కొర్రల ఆహారాన్ని తినిపించడం అనేది ఆరోగ్యకరమైన పరిష్కారమని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్లాంట్ సైన్సెస్ విభాగం పరిశోధకులు నిర్ధారించారు. డాక్టర్ ముతమిలరసన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఈ దిశగా చేసిన పరిశోధన విజయవంతమైంది. వీరు ఇక్రిశాట్ నుంచి 155 రకాలు, దిల్లీ నుంచి 185 రకాలు కొర్రలను సేకరించి, జీనోమ్ కోడ్ ఎడిటింగ్ పద్ధతిలో ఫైటిక్ యాసిడ్‌ను తగ్గించేందుకు ప్రయత్నించారు. ఫలితంగా 155 రకాల్లో 70 శాతం, 185 రకాల్లో 81 శాతం ఫైటిక్ యాసిడ్ తగ్గిందని నిర్ధారించారు. తదుపరి, ఈ కొత్తరకం కొర్రలను సాగు చేసి ప్రయోగశాలలో పరీక్షించారు, అప్పుడు ఫైటిక్ యాసిడ్ గణనీయంగా తగ్గినట్లు తెలిసింది.
చిన్నారులకు ఈ ప్రయోజనం ఎలా?
ఈ పరిశోధనకు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనుమతి ఇచ్చింది. సాధారణంగా కొర్రల్లో ఉన్న ఫైటిక్ యాసిడ్ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అయితే, ఫైటిక్ యాసిడ్ తగ్గించడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుందనీ, దీంతో చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రల లాంటి పంటల ప్రయోజనాలను అర్థం చేసుకునేందుకు డాక్టర్ ముతమిలరసన్ బృందం మూడేళ్లుగా పరిశోధనలు చేపట్టింది. 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం, భారత్‌లో ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్య 5.32 కోట్లుగా గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా, పోషకాహార లోపాన్ని తగ్గించడంపై ఫోకస్ చేస్తూ ఈ పరిశోధనను అభివృద్ధి చేశారు.
కేంద్ర సంస్థల అనుమతి రాగానే..
వీరు అభివృద్ధి చేసిన కొత్తరకం కొర్రలతో ఉప్మా లేదా జావ రూపంలో వారానికి మూడుసార్లు ఆరునెలలు పాటు ఆహారం అందిస్తే, చిన్నారుల్లో పోషకాహార లోపం తగ్గి, సాధారణంగా ఎదగగలరని నిర్ధారణకు వచ్చారు. ఈ కొత్త కొర్ర వంగడాల సాగుకు కేంద్ర సంస్థల అనుమతి రాగానే రెండేళ్లలో మార్కెటింగ్ చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు.