LOADING...
Nitish Rajput : కోర్టుకు చేరిన SSC పరీక్షల వివాదం.. నితీష్ రాజ్‌'పుత్ పై రూ.2.5 కోట్ల పరువు నష్టం కేసు
నితీష్ రాజ్‌'పుత్ పై రూ.2.5 కోట్ల పరువు నష్టం కేసు

Nitish Rajput : కోర్టుకు చేరిన SSC పరీక్షల వివాదం.. నితీష్ రాజ్‌'పుత్ పై రూ.2.5 కోట్ల పరువు నష్టం కేసు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
07:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పరీక్షల నిర్వహణపై కొనసాగుతున్న వివాదం ఇప్పుడు న్యాయస్థానాల దాకా చేరింది. SSC పరీక్షలు నిర్వహించే సంస్థల్లో ఒకటైన ఎడ్యూక్విటీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూట్యూబర్ నితీష్ రాజ్‌పుత్ పై ఢిల్లీ కోర్టులో రూ.2.5 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేయడంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. నితీష్ రాజ్‌పుత్ విడుదల చేసిన వీడియోలో,ఆర్టీఐల ద్వారా వచ్చిన సమాచారం సహా పలు డాక్యుమెంట్ల ఆధారంగా SSC టెండర్ల ప్రక్రియ,పరీక్షలు నిర్వహించే సంస్థల ఎంపికపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. నిబంధనల్లో జరిగిన మార్పులు,నిర్వహణలో లోపాలు పరీక్షల విశ్వసనీయతపై ప్రభావం చూపవచ్చని వీడియోలో పేర్కొన్నారు.

వివరాలు 

నితీష్ వీడియోలో తప్పుదోవ పట్టించే సమాచారం

ఈ వీడియోకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల నుంచి పెద్ద స్పందన వచ్చింది. గతంలో SSC పరీక్షల్లో సాంకేతిక సమస్యలు, ఆలస్యాలు, నిర్వహణ లోపాలు ఎదురయ్యాయని చాలా మంది అభ్యర్థులు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. అయితే నితీష్ వీడియోలో తప్పుదోవ పట్టించే సమాచారం ఉందని, దాని వల్ల తమ సంస్థకు పరువు నష్టం జరిగిందని ఎడ్యూక్విటీ టెక్నాలజీస్ కోర్టును ఆశ్రయించింది. వీడియోను తొలగించాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే ప్రజలకు అందుబాటులో ఉన్న ధృవీకరించిన రికార్డుల ఆధారంగానే తాను విశ్లేషణ చేశానని, అనేక మంది అభ్యర్థుల ఆందోళనలనే ప్రస్తావించానని చెబుతూ వీడియోను తొలగించేందుకు నితీష్ రాజ్‌పుత్ నిరాకరించారు.

వివరాలు 

దేశవ్యాప్తంగా ప్రభుత్వ నియామక ప్రక్రియలపై చర్చ

ఈ కేసుతో విషయం సోషల్ మీడియా, నిరసనల స్థాయి నుంచి న్యాయపోరాటంగా మారింది. విద్యార్థి సంఘాలు, అభ్యర్థుల సంఘాలు ఈ అంశంపై ఏకమవుతున్నట్లు సమాచారం. SSC నియామక వ్యవస్థపై, ముఖ్యంగా పరీక్షలు నిర్వహించే సంస్థల ఎంపిక, నిర్వహణ తీరుపై స్వతంత్ర విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ నియామక ప్రక్రియలపై గట్టిగా చర్చ జరుగుతున్న ఈ సమయంలో SSCపై మళ్లీ దృష్టి కేంద్రీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

వివరాలు 

పారదర్శకత, సంస్కరణలపై సాగుతున్న చర్చలకు కేంద్రబిందువు

గతంలో పరీక్షల అవకతవకలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న ఉదాహరణలు ఉండటంతో, ఈ వ్యవహారంలోనూ అలాంటి సమీక్ష జరుగుతుందేమోనన్న ఆశలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యాయపోరాటం కొనసాగుతుండగా, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి నితీష్ రాజ్‌పుత్-ఎడ్యూక్విటీ కేసు పారదర్శకత, సంస్కరణలపై సాగుతున్న చర్చలకు కేంద్రబిందువుగా మారింది.

Advertisement