Saudi Arabia: నదులు లేవు.. వర్షం లేదు.. అయినా 3.7 కోట్ల మందికి నిత్యం మంచినీరు! ఎలా సాధ్యం?
ఈ వార్తాకథనం ఏంటి
నదీ వ్యవస్థే లేదు.. 95 శాతం భూభాగం ఎడారి. వర్షపాతం కూడా చాలా తక్కువ. ఏడాదికి కురిసే వర్షం 100 మిల్లీమీటర్లకు మించదు. వేసవిలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే తక్కువకు రావడం అరుదు. ఇలాంటి ప్రాంతంలో బావి తవ్వినా నీటికి బదులు చమురు బయటపడే పరిస్థితి. అయినప్పటికీ 3.7 కోట్ల మందికి నిత్యం మంచినీటిని అందిస్తోంది సౌదీ అరేబియా (Saudi Arabia). సహజ నీటి వనరులు లేకపోయినా.. భారీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుని ఈ సమస్యను అధిగమించింది.
వివరాలు
సముద్రమే ప్రధాన నీటి వనరు
సౌదీ అరేబియా జనాభాలో ఎక్కువ మంది ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతాలకు సమీపంలోనే నివసిస్తారు.
అపారమైన చమురు నిల్వలు ఉన్న ఈ దేశం తాగునీటి అవసరాల కోసం మాత్రం సముద్ర జలాలపై ఆధారపడుతోంది.
ఇందుకోసం ఉప్పునీటిని శుద్ధి చేసే డీశాలినేషన్ ప్లాంట్లను (Desalination Plants) భారీ సంఖ్యలో ఏర్పాటు చేసింది.
సముద్రం నుంచి సేకరించిన నీటిని శుద్ధి చేసిన తర్వాత తీర ప్రాంతాల నుంచి దూరంగా ఉన్న నగరాలు, ఎడారి ప్రాంతాలకు తరలించేందుకు వేల కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను నిర్మించింది.
ఫలితంగా సహజంగా నదులు లేని ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటైన సౌదీలో ఓ రకమైన కృత్రిమ నదీ వ్యవస్థ ఏర్పడింది.
వివరాలు
ఎడారిలో పైప్‌లైన్ వేయడం అంత సులువు కాదు..
సౌదీ అరేబియాలో భారీ పైప్‌లైన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం అంత తేలికైన పని కాదు.
మండే ఎండలు, ఇసుక నేల, భూగర్భ పీడనం వంటి సవాళ్లతో పాటు సముద్రపు ఉప్పునీటి ప్రభావాన్ని కూడా ఈ వ్యవస్థ తట్టుకోవాలి.
అందుకే దశాబ్దాల పాటు పనిచేసేలా అత్యంత పటిష్ఠమైన పైప్‌లైన్లను నిర్మించారు.
చమురు, సహజ వాయువు పైప్‌లైన్లలో ఉపయోగించే అధిక సామర్థ్యమున్న కార్బన్ స్టీల్‌తో వీటిని తయారు చేశారు.
పైపుల నాణ్యతను ఆల్ట్రాసోనిక్ పరీక్షల ద్వారా పరిశీలిస్తారు. తుప్పు పట్టకుండా ప్రత్యేక రక్షణ పూతను కూడా వేస్తారు.
వివరాలు
ఎడారిలో పైప్‌లైన్ వేయడం అంత సులువు కాదు..
తయారైన పైపులను భారీ ట్రక్కుల్లో తరలించి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడారి ప్రాంతాలకు తీసుకెళ్తారు.
అక్కడ ముందుగా జీపీఎస్, ఆధునిక సర్వే పరికరాల సాయంతో పైప్‌లైన్ మార్గాన్ని నిర్ణయిస్తారు.
రాళ్లు, పర్వతాలు అడ్డుగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట పేలుళ్లతో కందకాలు ఏర్పాటు చేస్తారు.
అనంతరం పైపులను వాటిలోకి దించి.. ఒక్కో భాగాన్ని అనుసంధానం చేస్తూ భారీ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తారు.
వివరాలు
సముద్ర జీవులు ప్లాంట్‌లోకి ప్రవేశించకుండా ప్రత్యేక రక్షణ తెరలు
ఈ మొత్తం వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రక్రియ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డీశాలినేషన్ ప్లాంట్లలో జరుగుతుంది.
సముద్రపు నీటిని ప్లాంట్లలోకి తీసుకురావడానికి తీరం నుంచి కొన్ని వందల మీటర్ల దూరంలో భారీ ఇన్‌టేక్ పైపులను ఏర్పాటు చేస్తారు.
63సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఓ పైపు రోజుకు సుమారు 15మిలియన్ లీటర్ల నీటిని పంప్ చేయగలదు.
సముద్ర జీవులు ప్లాంట్‌లోకి ప్రవేశించకుండా ప్రత్యేక రక్షణ తెరలను ఏర్పాటు చేస్తారు.
వీటి ద్వారా చేపలు, పీతలు,జెల్లీ ఫిష్‌లు వంటి జీవులు లోపలికి రాకుండా అడ్డుకుంటారు.
ఆ తర్వాత నీటిని వడపోసి శుద్ధి చేసే ప్రక్రియ మొదలవుతుంది. అయితే సముద్రపు నీటిలోని ఉప్పు, ఇతర మలినాలను తొలగించిన తర్వాత ఖనిజాల స్థాయి చాలా తక్కువగా ఉంటుంది.
వివరాలు
అవసరమైన ఖనిజాలను మళ్లీ కలుపుతారు
దీంతో నీటి రుచి కూడా చప్పగా అనిపిస్తుంది.
శుద్ధి చేసిన నీటిని నేరుగా తాగునీటిగా మార్చకుండా.. అందులో కాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలను తిరిగి జోడిస్తారు.
అదే సమయంలో నీటిని తాగేందుకు అనువుగా ఉండేలా pH స్థాయిని కూడా సర్దుబాటు చేస్తారు.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నీటిని భారీ పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేస్తారు.
వివరాలు
అత్యంత ఖరీదైన నీటి వ్యవస్థ
సౌదీ అరేబియా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థకు భారీగా ఖర్చవుతుంది.
ముఖ్యంగా ఒక కిలోమీటర్ మేర పైప్‌లైన్ నిర్మించడానికే మిలియన్ల డాలర్లు అవసరమవుతాయి.
డీశాలినేషన్ ప్లాంట్ల నిర్వహణ, నీటి శుద్ధి, పైప్‌లైన్‌ల నిర్మాణం, వాటి సంరక్షణ.. అన్నీ కలిపితే ఇది అత్యంత ఖరీదైన మౌలిక సదుపాయాల వ్యవస్థగా మారుతుంది.
సహజసిద్ధమైన నదులు, సరిపడా వర్షపాతం లేని సౌదీ అరేబియా.. సముద్రపు నీటిని శుద్ధి చేసి, వందల కిలోమీటర్ల దూరంలోని ఎడారి ప్రాంతాలకు తరలించే విధంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది.
దేశ ప్రజల నీటి అవసరాలను తీర్చే ఈ భారీ నెట్‌వర్క్‌ను జాతీయ మౌలిక సదుపాయాల్లో కీలక భాగంగా మార్చుకోవడం ద్వారా సౌదీ అరేబియా ప్రత్యేకతను చాటుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎడారి దేశంలో సౌదీ నిర్మించిన కృత్రిమ నదీ వ్యవస్థ
Saudi Arabia has no rivers… yet billions of litres of freshwater are produced every day.
— ChroniX (@ChroniXvault) September 1, 2026
So how does a desert country turn the ocean into drinking water?
The answer: massive desalination plants, high-pressure membranes and an enormous pipeline network. #Engineering pic.twitter.com/SU30x6jyxT