Nobel Prize: నోబెల్ బహుమతి.. మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలివే!
ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద 1901 నుంచి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు. ఈ బహుమతులు ఐదు ముఖ్య రంగాల్లో అందిస్తారు. భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థికశాస్త్రంలో అందజేస్తారు. 1968 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఈ బహుమతులను ఆర్థిక రంగంలో కూడా అందించడం ప్రారంభించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 10న, ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఈ బహుమతులు ప్రకటిస్తారు. వీటి కింద లభించే నగదు ప్రోత్సాహం ప్రతేడాది మారుతుంటుంది.
గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు శాంతి బహుమతిని పొందిన ఆంగ్ సాన్ సూకీ
ఈ ఏడాది బహుమతి రివార్డ్ మొత్తం 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ అని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. డిసెంబర్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గ్రహీతలు ఈ నగదుతో పాటు 18 క్యారెట్ల బంగారు పతకం, డిప్లోమా కూడా అందుకుంటారు. ఇప్పటి వరకు, ఐదుగురు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు వారి శిక్షనుభవం కారణంగా అవార్డు వేడుకకు హాజరుకాలేకపోయారు. వారిలో 1936లో నాజీ శిబిరంలో నిర్బంధితులుగా ఉన్న జర్మన్ జర్నలిస్టు కార్ల్ వాన్ ఒస్సిట్జ్కీ కూడా ఉన్నారు. 1991లో మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు శాంతి బహుమతిని గెలుచుకున్నారు.
జైలులో ఉన్నప్పుడు నోబెల్ బహుమతి అందుకున్న నర్గెస్ మొహమ్మదీ
2010లో చైనా అసమ్మతి వాది లియు జియాబో జైలులో ఉన్నాడు. 2022లో బెలారసియన్ మానవ హక్కుల ప్రచారకుడు అలెస్ బిలియాట్స్కీ కూడా జైలులో ఉన్న సమయంలో బహుమతిని గెలుచుకున్నారు. 2023లో ఇరాన్ కార్యకర్త నర్గెస్ మొహమ్మదీ తన నోబెల్ బహుమతిని ఇరాన్ జైలులో ఉన్నపుడే అందుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసుఫ్జై 17 ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుని, నోబెల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. 1915లో 25 ఏళ్ల వయసులో లారెన్స్ బ్రాగ్ తన తండ్రితో కలిసి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు.
97 ఏళ్ల వయస్సులో నోబెల్ బహుమతి అందుకున్న జాన్ గూడెనఫ్
97 ఏళ్ల వయసులో 2019లో కెమిస్ట్రీ నోబెల్ గ్రహీతగా నిలిచిన జాన్ గూడెనఫ్, అత్యంత వృద్ధ గ్రహీతగా చరిత్ర సృష్టించాడు. 1974 నుండి నోబెల్ ఫౌండేషన్ మరణించిన వారికి బహుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. బహుమతి ప్రకటించిన తర్వాత డిసెంబర్‌లో అవార్డు ఇవ్వడానికీ మధ్య ఒక వ్యక్తి మరణిస్తే, వారు ఇంకా బహుమతిని పొందగలరు. స్వీడిష్ అకాడమీ ప్రతి సంవత్సరం సుమారు 300 నామినేషన్లను అందుకుంటుంది. మాజీ బహుమతి గ్రహీతలు, విద్యావేత్తలు, సంస్థలు, సాహిత్య, భాషా ప్రొఫెసర్లు నామినేషన్లను సమర్పిస్తారు. అయితే తామే తమను నామినేట్ చేసుకునే అవకాశం లేదు.