LOADING...
Healthy Diet:వృద్ధుల ఆరోగ్యానికి నట్స్‌ బలం.. పోషక లోపాలకు చెక్
వృద్ధుల ఆరోగ్యానికి నట్స్‌ బలం.. పోషక లోపాలకు చెక్

Healthy Diet:వృద్ధుల ఆరోగ్యానికి నట్స్‌ బలం.. పోషక లోపాలకు చెక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

వృద్ధులు ఆరోగ్యంగా ఉండేందుకు, ముఖ్యంగా తగినంత ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో గింజ పప్పులు ఎంతో మేలు చేస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. బాదం, పిస్తా వంటి నట్స్‌ వృద్ధుల పోషక అవసరాలను తీరుస్తాయని మోనాష్‌ యూనివర్సిటీ నేతృత్వంలోని పరిశోధక బృందం గుర్తించింది. ఈ అధ్యయనంలో 70 ఏళ్లు పైబడిన 9,916 మందిని పరిశీలించారు. ఏ రకమైన గింజ పప్పులైనా సరే, వాటిని తరచుగా తీసుకునే వారు ఎక్కువకాలం జీవిస్తున్నారని అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా మతిమరుపు, వైకల్యాలు వంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించే అవకాశాలు వీరిలో ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. గింజ పప్పుల్లో ప్రొటీన్‌, సూక్ష్మ పోషకాలు, అసంతృప్త కొవ్వులు, పీచు (ఫైబర్‌) సమృద్ధిగా ఉంటాయి.

Details

సలాడ్లలో కలిపి తీసుకోవచ్చు

అందువల్ల వీటిని చిరుతిండిగా గానీ, భోజనంలో భాగంగా గానీ తీసుకోవడం మంచిదని సూచించారు. అయితే పళ్లు బలంగా లేని వారు లేదా నమిలే సమస్యలు ఉన్నవారు పూర్తి పప్పులను తినలేకపోవచ్చు. అలాంటి వారు పప్పులను పగలగొట్టి లేదా చిన్న ముక్కలుగా చేసి సలాడ్లలో కలిపి తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో నట్‌ మీల్స్‌, నట్‌ బటర్‌లు, నట్‌ పేస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. పళ్లు బలంగా లేని వృద్ధులకు ఇవి ఎంతో అనువుగా ఉంటాయి. అయితే ఉప్పు, చక్కెర లేదా చాక్లెట్‌తో కలిపిన గింజ పప్పులను వీలైనంత వరకు దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Details

చిన్న పిడికెడు గింజ పప్పులు తినొచ్చు

వృద్ధులు రోజుకు సుమారు 30 గ్రాములు, అంటే చిన్న పిడికెడు గింజ పప్పులు తినవచ్చని సిఫారసు చేస్తున్నారు. ఇది సుమారుగా 25 బాదం గింజలు, 10 అక్రోట్లు లేదా 40 వేరుసెనగలకు సమానం. వేర్వేరు రకాల పప్పులను కలిపి తింటే వివిధ పోషకాలు లభిస్తాయి. తాజా గింజ పప్పులు రుచిగా ఉండటమే కాకుండా, పోషకాల పరంగా కూడా మెరుగ్గా ఉంటాయి. అందుకే వీటిని గాలి చొరని సీసాల్లో పెట్టి, చల్లటి ప్రదేశంలో భద్రపరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement