
Ganapathi Prasad: వినాయకుడికి ప్రియమైన నైవేద్యాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
వినాయక చవితి సమీపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గణపతిని పూజిస్తారు. గణేశుడు భోజనప్రియుడు అని శాస్త్రాలు చెబుతాయి. అందుకే చవితి రోజున స్వామి ఇష్టమైన వంటకాలను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ ఎంత నిష్ఠతో చేస్తారో, ప్రసాదాలూ అంతే నిష్ఠతో వంటరిగా తయారు చేస్తారు. మరి వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు ఏమిటి? వాటి తయారీ విధానం ఏమిటి? ఇప్పుడు చూద్దాం. గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు ఉండ్రాళ్లు, పులిహోర, బెల్లం కుడుములు, పాలతాళికలు, పాయసం, మోదకాలు ఇవి ముఖ్యమైనవి.
Details
1) ఉండ్రాళ్లు
కావలసిన పదార్థాలు పచ్చి శనగపప్పు - పావు కప్పు (అరగంట నానబెట్టాలి) బియ్యం రవ్వ - ఒక కప్పు నెయ్యి - 2 టీ స్పూన్లు జీలకర్ర - తగినంత పచ్చి కొబ్బరి - సన్నగా తరిగినది
Details
తయారీ విధానం
బియ్యం రవ్వను దోరగా వేయించాలి. పాన్‌లో నెయ్యి వేసి, జీలకర్ర, పచ్చికొబ్బరి వేసి దోరగా వేయించాలి. నీరు లేకుండా శనగపప్పు వేసి వేయించాలి. 2½ కప్పుల నీరు పోసి మరుగుతుండగా ఉప్పు కలపాలి. శనగపప్పు ఉడికిన తర్వాత రవ్వ వేసి కలపాలి. చల్లారిన తర్వాత లడ్డూలా చేయాలి. ఇడ్లీ ప్లేట్‌పై నెయ్యి రాసి ఉండ్రాళ్లను వేసి 15 నిమిషాలు ఆవిరి పక్కన పెట్టాలి. రుచికరమైన బియ్యం నూక ఉండ్రాళ్లు సిద్ధం
Details
2) చింతపండు పులిహోర
కావలసిన పదార్థాలు బియ్యం - 1 కప్పు, చింతపండు - కొద్దిగా, పసుపు - 1 స్పూన్, పల్లీలు - 3 స్పూన్లు, ఆవాలు శనగపప్పు, జీలకర్ర - ఒక్కో స్పూన్, ఎండు మిర్చి - 4, పచ్చిమిర్చి - 4, మిరియాలు - 1 స్పూన్ నూనె, ఉప్పు, కరివేపాకు తగినంత.
Details
తయారీ విధానం
చింతపండును వేడి నీటిలో నానబెట్టాలి. బియ్యం పొడిపొడిగా వండి పక్కన పెట్టాలి. చింతపండు రసం, నీరు, పచ్చిమిర్చి, మిరియాలు, పసుపు వేసి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. వేరే కడాయిలో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, పల్లీలు, ఎండు మిర్చి, కరివేపాకు వేయించాలి. అన్నంలో చింతపండు రసం, ఉప్పు వేసి కలపాలి. చివరగా వేయించిన తాలింపు కలిపితే పులిహోర సిద్ధం.
Details
3) బెల్లం కుడుములు
కావలసిన పదార్థాలు బెల్లం - 1 కప్పు, తడి బియ్యం పిండి - 1 కప్పు, పచ్చి కొబ్బరి - 2 స్పూన్లు, యాలకుల పొడి - 1 స్పూన్, పచ్చి శనగపప్పు - 2 స్పూన్లు, నీరు - 2 కప్పులు. తయారీ విధానం నీటిలో శనగపప్పు మెత్తగా ఉడికించాలి. అందులో బెల్లం వేసి కరిగించాలి. కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. బియ్యం పిండి వేసి ముద్దలా కలపాలి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని కుడుములు చేయాలి. 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. గణపయ్యకు ఇష్టమైన బెల్లం కుడుములు సిద్ధం.
Details
4) పాలతాళికలు
కావలసిన పదార్థాలు బియ్యం పిండి - 1 కప్పు, నీళ్లు - 1½ కప్పు, పాలు - 4 కప్పులు, బెల్లం - 1 కప్పు, యాలకుల పొడి - అర స్పూన్, నెయ్యి - 4 స్పూన్లు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం - తగినంత. తయారీ విధానం నీళ్లు మరిగించి ఉప్పు వేసి బియ్యం పిండి వేసి ముద్దలా చేయాలి. నెయ్యి, కొద్దిగా పంచదార వేసి కలపాలి. చల్లారిన తర్వాత పిండిని పొడవుగా తాళికలుగా చేయాలి. పాలు మరిగించి వాటిలో తాళికలు వేసి 20 నిమిషాలు ఉడికించాలి. బెల్లం తురుము వేసి కరిగించాలి. యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. పాలతాళికలు సిద్ధం.
Details
5) పాయసం
కావలసిన పదార్థాలు సేమియా - 1 కప్పు, చక్కెర - ¼ కప్పు, యాలకులు, పాలు - ½ లీటర్, నెయ్యి - 2 స్పూన్లు, డ్రైఫ్రూట్స్ - తగినంత. తయారీ విధానం నెయ్యిలో డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టాలి. సేమియాను నెయ్యిలో వేయించాలి. నీటిలో సేమియా ఉడికించి, తర్వాత పాలు, చక్కెర కలపాలి. చివరగా యాలకులు, డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. రుచికరమైన పాయసం సిద్ధం.
Details
6) మోదకాలు
కావలసిన పదార్థాలు పచ్చికొబ్బరి - 100 గ్రాములు, బెల్లం - 100 గ్రాములు, నెయ్యి - 1 టీ స్పూన్, యాలకుల పొడి, జాజికాయ పొడి, బియ్యం పిండి - 1 కప్పు, నీరు - 1 కప్పు, ఉప్పు - చిటికెడు. తయారీ విధానం బెల్లం, కొబ్బరి, యాలకుల పొడి, జాజికాయ పొడి కలిపి పాకం చేయాలి. నీటిలో ఉప్పు వేసి బియ్యం పిండి కలిపి ముద్దలా చేయాలి. పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని మోదక్ మోల్స్‌లో పెట్టాలి. లోపల బెల్లం మిశ్రమం నింపి కవర్ చేయాలి. 10-12 నిమిషాలు ఆవిరి మీద ఉడికిస్తే మోదకాలు సిద్ధం.