Papikondalu: దసరా సెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ ఛాయిస్ పాపికొండలు టూర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో, కుటుంబ సమేతంగా సందర్శించదగ్గ అనేక పర్యాటక ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. సువిశాల గోదావరి నది తీరం కలిగిన ఈ జిల్లాలో, ఎత్తైన కొండలు, పచ్చని వృక్షాలు, అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం కలగలసిన ప్రదేశాలు ఉన్నాయి. రోజువారీ ఒత్తిడిని తగ్గించుకుని, ప్రశాంతమైన పర్యాటక ప్రాంతాన్ని సందర్శించాలనుకునే వారు ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై ఆసక్తి చూపుతుంటారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నపటికీ.. అందరికి ముందుగా గుర్తువచ్చేది మాత్రం పాపికొండలే.
సెలవు రోజుల్లో అయితే వెయ్యి మందికి పైగా పాపికొండలను సందర్శిస్తారు
పాపికొండలు, గోదావరి నది రెండు వైపులా విస్తరించి ఉండే ఒక అందమైన ప్రాంతం. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తూ, పాపికొండలు,నది పక్కన ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. వీఆర్‌పురం మండలంలోని పోచవరం బోట్ పాయింట్ నుంచి రోజుకు సుమారు 300 మంది పర్యాటకులు, సెలవు రోజుల్లో అయితే వెయ్యి మందికి పైగా పాపికొండలను సందర్శించేందుకు వస్తున్నారు. ఈ ప్రాంతం, నిత్య జీవిత ఒత్తిడుల నుంచి విముక్తిని పొందాలనుకునే పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పాపికొండలు బోటు షికారు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు.
పోచవరం బోట్ పాయింట్‌కు రోడ్డు మార్గం
భద్రాచలం రామాలయాన్ని దర్శించిన తరువాత, 75 కిలోమీటర్ల దూరంలోని పోచవరం బోట్ పాయింట్‌కు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుంచి గోదావరి నదిలో బోటు ప్రయాణం ప్రారంభమవుతుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పోశమ్మ గండి ఆలయం వద్ద కూడా బోటు పాయింట్ ఉంది, అక్కడి నుంచి పర్యాటకులు పాపికొండల విహార యాత్రకు బయలుదేరతారు. రాజమండ్రి నుంచి కూడా వాహనాలలో పురుషోత్తపట్నం మీదుగా పోశమ్మగండికి చేరుకోవచ్చు. పెద్దల టికెట్ ధర రూ. 950, పిల్లలకు రూ. 750గా నిర్ణయించారు. లాంచీ పోచవరం నుంచి బయలుదేరి, పాపికొండల్లోని కొర్టూరు వరకు వెళ్లి తిరిగి వస్తుంది.
తెలంగాణ టూరిజం వెబ్‌సైట్ ద్వారా టికెట్లు
మార్గమధ్యలో పేరంటాలపల్లి ఆశ్రమాన్ని కూడా చూపిస్తారు. ప్రయాణ సమయంలో టీ, టిఫిన్, భోజనం లాంచీ నిర్వాహకుల ద్వారా అందించబడుతుంది. పాపికొండల యాత్రకు వెళ్లే వారు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్ ద్వారా టికెట్లను పొందవచ్చు. భద్రాచలం నుంచి ప్రయాణం చేసే పర్యాటకులు అదనంగా ట్రాన్స్‌పోర్ట్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.