వినాయక చవితి: నవరాత్రుల్లో గణపతికి ఏ రోజున ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
వినాయక చవితి పండగంటే తొమ్మిది రోజులు సందడిగా ఉంటుంది. నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్టాల్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి.
తొమ్మిది రోజుల పాటు వినాయకుడిని రకరకాలుగా పూజిస్తారు. ప్రస్తుతం తొమ్మిది రోజుల పాటు ఏయే రకాల నైవేద్యాలు సమర్పించాలో చూద్దాం.
ఉండ్రాళ్ళు:
మొదటి రోజు వరసిద్ధి వినాయకుడిగా గణేషుడిని పూజిస్తారు. మొదటిరోజు ఉండ్రాళ్ళు, కుడుములు, పాలతాళికలు ఖచ్చితంగా చేస్తారు. మీకు నచ్చిన పద్దతిలో ఉండ్రాళ్ళు తయారుచేసిన నైవేద్యం సమర్పించండి.
అటుకులు:
రెండో రోజు వికట వినాయకుడిగా గణేషుడిని కొలుస్తారు. నవరాత్రుల్లో రెండవ రోజు అటుకులను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి. అటుకులతో రకరకాల వెరైటీలు చేయవచ్చు లేదా అటుకులు బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించవచ్చు.
Details
పేలాలు, బెల్లం కలిపిన నైవేద్యం
మూడవ రోజు నాడు వినాయకుడికి పేలాలను నైవేద్యంగా సమర్పిస్తారు. లంబోదర వినాయకుడిగా ఈరోజు గణేశుడు దర్శనమిస్తాడు. పేలాలు,బెల్లం కలిపి నైవేద్యం తయారు చేయవచ్చు.
చెరుకు:
నవరాత్రుల్లో నాలుగవ రోజు వినాయకుడికి చెరుకు గడలు సమర్పించాలి. సాధారణంగా వినాయక చవితి రోజున పూజలో భాగంగా చెరుకు గడలను కూడా సమర్పిస్తారు.
నాలుగవ రోజు కూడా చెరుకు గడ్డలను ప్రత్యేకంగా వినాయకుడికి సమర్పిస్తారు. ఈరోజు గజానన వినాయకుడిగా గణేషుడు దర్శనమిస్తాడు.
కొబ్బరితో నైవేద్యం:
ఐదవ రోజు మహోదర వినాయకుడిగా గణేషుడు దర్శనమిస్తాడు. ఈ రోజున కొబ్బరితో చేసిన తీపి పదార్థాలు ఇంకా ఇతర పదార్థాలను గణేషుడికి నైవేద్యంగా సమర్పించాలి.
Details
నువ్వులు, పంచదార కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా..
6వ రోజున గణేషుడు ఏకదంత వినాయకుడిగా దర్శనమిస్తాడు. ఈ రోజున నువ్వులు, చక్కెర కలిపిన మిశ్రమం లేదా నువ్వులతో చేసిన లడ్డూ మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి.
పండ్లు:
ఏడో రోజు వక్రతుండ వినాయకుడిగా గణేషుడు కనిపిస్తాడు. ఏడవ రోజున పండ్లను ప్రత్యేకంగా సమర్పించాల్సి ఉంటుంది. అరటిపండ్ల నుంచి మొదలుకొని దానిమ్మ, ఆపిల్ ఇలా రకరకాల పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు.
సత్తుపిండి:
విఘ్నరాజ వినాయకుడిగా దర్శనమిచ్చే 8వ రోజున వినాయకుడికి సత్తిపండుని నైవేద్యంగా సమర్పించాలి. సత్తు పిండి తయారు చేయడం వీలు కాకపోతే మార్కెట్లో ఈజీగా లభ్యమవుతుంది.
నెయ్యితో చేసిన అప్పాలు:
9వ రోజున ధూమ్రవర్ణ వినాయకుడిగా గణేషుడు దర్శనమిస్తాడు. ఈ రోజున నెయ్యితో చేసిన అప్పాలను గణేశుడికి సమర్పించాల్సి ఉంటుంది.