Finger Millet: రాగులు నిజమైన క్యాల్షియం గనులు.. ఎముకల ఆరోగ్యానికి వరం!
ఈ వార్తాకథనం ఏంటి
రాగులు పరిమాణంలో చిన్నవిగా కనిపించినా, పోషక విలువల పరంగా మాత్రం నిజమైన క్యాల్షియం గనులే. ప్రతి 100 గ్రాముల రాగుల్లో సుమారు 340 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అంతేకాదు, ఐరన్, అమైనో ఆమ్లాలు, పొటాషియం, జింక్, మెగ్నీషియం, పీచు (ఫైబర్) వంటి ముఖ్యమైన పోషకాలు కూడా వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఈ కారణంగా రాగులు ఎముకలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఊబకాయం నియంత్రణకు, అధిక రక్తపోటు తగ్గించేందుకు, రక్తంలో గ్లూకోజు స్థాయిలు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా ఇవి సహాయపడతాయి. ఫలితంగా గుండెజబ్బుల ముప్పు కూడా తగ్గుతుంది. అయితే రాగుల్లో ఫైటేట్స్, ఆక్సలేట్స్ ఉండటాన్ని కూడా గమనించాలి. ఇవి శరీరం క్యాల్షియంను పూర్తిగా శోషించుకోకుండా అడ్డుతగులుతాయి.
Details
ఆహారంలో రాగులను చేర్చుకోవాలి
అంటే రాగుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉన్నప్పటికీ, అది శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు. రాగులు త్వరగా జీర్ణం కావు. జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారికి ఇవి అంతగా సరిపోవు. ఈ పరిస్థితుల్లో కొందరికి క్యాల్షియం మాత్రలు అవసరమవుతాయి. ముఖ్యంగా నెలసరి నిలిచే దశలో ఉన్న మహిళలకు, అలాగే నెలసరి పూర్తిగా నిలిచినవారికి క్యాల్షియం అవసరం మరింతగా పెరుగుతుంది. ఎముకలు గుల్లబారకుండా కాపాడుకోవడానికి ఇది అవసరం. కానీ రోజువారీ ఆహారంతోనే పెద్దమొత్తంలో క్యాల్షియంను పొందడం చాలా కష్టం. అందుకే వైద్యులు క్యాల్షియం మాత్రలను సూచిస్తే తప్పకుండా తీసుకోవాలి. మాత్రల రూపంలో తీసుకునే క్యాల్షియంను శరీరం చాలా వరకు శోషించుకుంటుంది. దీనికి తోడు ఆహారంలో రాగులను కూడా చేర్చుకుంటే, క్యాల్షియం అందుబాటు మరింత మెరుగై మంచి ఫలితాలు కనిపిస్తాయి.