Ramadan 2024: రేపు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం.. సహర్,ఇఫ్తార్ అంటే ఏమిటో తెలుసుకోండి
రంజాన్ ఇస్లాం మతంలో అత్యంత ముఖ్యమైన నెల. రంజాన్ మాసం రేపు మార్చి 12 నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజున రంజాన్ మొదటి ఉపవాసం పాటించబడుతుంది. ఇస్లాంలో ఉపవాసం అంటే దేవునికి అంకితం చేసుకోవడం. ఈ ఉపవాసం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఒక నెల మొత్తం ఆచరిస్తారు. దీనితో పాటు, రంజాన్ మాసంలో సహర్,ఇఫ్తార్ సంప్రదాయాన్ని కూడా నిర్వహిస్తారు. అయితే సహర్, ఇఫ్తార్ సంప్రదాయం ఎలా జరుగుతుందో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి...
నమాజ్ చేసే సమయం
ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం, రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారు ఉదయం సూర్యోదయానికి ముందు ఏదైనా తింటే, దానిని సహర్ అని పిలుస్తారు. రోజంతా ప్రార్థన చేసి సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం దేవుడిని ప్రార్థించిన తర్వాత ఉపవాసం విరమిస్తే దానిని ఇఫ్తార్ అంటారు. ఉపవాస సమయంలో ఏదైనా తినడం లేదా త్రాగడం అనుమతించబడదు. సహర్ , ఇఫ్తార్ సంప్రదాయాన్ని ఏ నగరంలో ఏ సమయంలో జరుపుకుంటారో తెలుసుకుందాం.
దేశంలో వివిధ నగరాల్లో సహర్ నుంచి ఇఫ్తార్ సమయం వివరాలు
హైదరాబాద్: సహర్ 05:16 AM; ఇఫ్తార్: 06:26 PM ముంబై: సహర్ 05:38 AM; ఇఫ్తార్: 06:48 PM ఢిల్లీ: సహర్ 05:18 AM; ఇఫ్తార్: 06:27 PM పూణె: సహర్ 05:34 AM; ఇఫ్తార్: 06:44 PM చెన్నై: సహర్ 05:08 AM; ఇఫ్తార్: 06:20 PM బెంగళూరు: సహర్ 05:19 AM; ఇఫ్తార్: 06:31 PM
రంజాన్ ఎందుకు ప్రత్యేకం?
రంజాన్ మాసం ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైనది, ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ఈ మాసం అంతా రోజా అంటే ఉపవాసం ఉంటారు. అల్లాహ్‌ను ఆరాధించడంలో, అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ నెల చివరిలో ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోవడంలో ఎక్కువ సమయం గడుపుతారు. దీన్నే మీతీ ఈద్ అని కూడా అంటారు. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం,రంజాన్ నెల చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ నెలలో ప్రవక్త మహమ్మద్ ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ షరీఫ్‌ను 610 సంవత్సరంలో లైలతుల్-ఖద్ర్ సందర్భంగా స్వీకరించారు. రంజాన్ మాసంలో తరావీహ్ నమాజులు చేస్తారని చెబుతారు. ఈ నమాజ్ ప్రత్యేకత ఏమిటంటే, రంజాన్ మొత్తం కాలంలో, ఇమామ్ సాహిబ్ తరావీహ్ నమాజ్‌లో మొత్తం ఖురాన్‌ను పఠిస్తారు.