Chernobyl: చెర్నోబిల్ నీలి కుక్కల మిస్టరీ వీడింది: రేడియేషన్ కాదు… మురికే కారణం!
ఈ వార్తాకథనం ఏంటి
చెర్నోబిల్‌లో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నీలి రంగు కుక్కలు... రేడియేషన్ ప్రభావంతో మారిపోయాయంటూ ప్రచారం జరిగిందని మీరు గుర్తు పెట్టుకునే ఉంటారు. అయితే, ఈ కుక్కలు రేడియేషన్ కారణంగా నీలంగా మారలేదని, తలకిందులైన ఓ పోర్టా-పాటీలో పడిపోయి అందులో ఉన్న మురికిలో దొర్లడం వల్లే శరీరానికి నీలి రంగు అంటుకుందని స్థానిక జంతు సేవకులు తెలిపారు. ఈ కుక్కల ఫొటోలు అక్టోబర్‌లో 'డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్' ప్రోగ్రామ్ ద్వారా బయటకు రావడంతో నెటిజన్లలో రేడియేషన్ మ్యూటేషన్లపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వదంతులను ఖండిస్తూ, 'క్లీన్ ఫ్యూచర్స్ ఫండ్'కు చెందిన శాస్త్రవేత్త డా. టిమోతి ఎ. మౌసో ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో స్పందించారు.
వివరాలు
18 చదరపు మైళ్ళ నిషేధిత ప్రాంతంలో సుమారు 700 కుక్కలు
"కుక్కలు మురికి వద్ద దొర్లే అలవాటు ఉంటుంది. తలకిందులైన పోర్టా-పాటీలో అవి దొర్లడం వల్లే నీలి డై శరీరానికి అంటుకుంది. దీనికి రేడియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదు" అని ఆయన స్పష్టం చేశారు. క్యాచ్ అండ్ స్టెరిలైజేషన్ కార్యక్రమం సమయంలో పూర్తిగా నీలిగా మారిన మూడు కుక్కలు తమకు ఎదురుపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం 1986 అణు ప్రమాదానంతరం అక్కడే మిగిలిపోయిన కుక్కల వంశస్తులుగా సుమారు 700 కుక్కలు 18 చదరపు మైళ్ళ నిషేధిత ప్రాంతంలో జీవిస్తున్నాయని వెల్లడించారు. 2024లో విడుదలైన అధ్యయనం ప్రకారం ఈ కుక్కల్లో రేడియేషన్, కాలుష్యం, హెవీ మెటల్స్‌ను తట్టుకునే ఒక రకమైన జన్యమార్పు కనిపించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.