Roche Cancer injection : క్యాన్సర్ చికిత్సలో కొత్త అధ్యాయం.. 7 నిమిషాల్లో ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో క్యాన్సర్ చికిత్స రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల కోసం అత్యాధునిక ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. రోచ్ ఫార్మా ఇండియా సంస్థ తీసుకొచ్చిన 'టెసెంట్రిక్' ఔషధం ద్వారా కేవలం ఏడు నిమిషాల్లోనే చికిత్స పూర్తయ్యే అవకాశం ఏర్పడింది. ఇప్పటివరకు నరాల ద్వారా ఇచ్చే చికిత్సకు గంటల సమయం పట్టేది. అయితే ఈ కొత్త విధానంలో చర్మం కింద ఇంజెక్షన్ రూపంలో మందు ఇవ్వడంతో ప్రక్రియ చాలా వేగంగా ముగుస్తోంది. ముఖ్యంగా దేశంలో ఎక్కువగా కనిపించే నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ బాధితులకు ఈ చికిత్స ఉపయోగపడనుంది. ఈ కొత్త చికిత్సతో రోగులు ఆసుపత్రిలో ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం తగ్గనుంది.
వివరాలు
ఇమ్యునోథెరపీ ఎలా పనిచేస్తుంది?
అలాగే ఆసుపత్రులపై ఉండే ఒత్తిడి కూడా కొంత మేర తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ఔషధం ధర మాత్రం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది. సాధారణంగా కీమోథెరపీ చికిత్సలో క్యాన్సర్ కణాలను నేరుగా నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రక్రియలో ఆరోగ్యకరమైన కణాలు కూడా ప్రభావితమవుతాయి. కానీ ఇమ్యునోథెరపీ మాత్రం శరీరంలోని సహజ రోగనిరోధక శక్తిని బలపరచి క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేస్తుంది. అందువల్ల దుష్ప్రభావాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇంజెక్షన్‌లో 'అటెజోలిజుమాబ్' అనే ఔషధం ఉంటుంది. ఇది శరీరంలో ఉండే 'పీడీ-ఎల్1' ప్రోటీన్‌ను అడ్డుకుంటుంది. సాధారణంగా క్యాన్సర్ కణాలు ఈ ప్రోటీన్ సహాయంతో రోగనిరోధక వ్యవస్థకు కనిపించకుండా తప్పించుకుంటాయి.
వివరాలు
ఈ ఇంజెక్షన్ ప్రత్యేకతలు ఇవే..
ఈమందు ఆ రక్షణను తొలగించడంతో శరీరంలోని రోగనిరోధక కణాలు క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేస్తాయి. ముఖ్యంగా పీడీ-ఎల్1 స్థాయిలు ఎక్కువగా ఉన్న రోగుల్లో ఈ చికిత్స మెరుగైన ఫలితాలు ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈచికిత్సలో ప్రధాన ఆకర్షణ వేగం.గంటల తరబడి పడకపై ఉండాల్సిన అవసరం లేకుండా కేవలం ఏడు నిమిషాల్లోనే మందు ఇస్తారు. సాధారణంగా తొడ భాగంలోని చర్మం కింద ఈ ఇంజెక్షన్ ఇస్తారు.దీనివల్ల ఆసుపత్రుల్లో వేచి ఉండే సమయం, రద్దీ రెండూ తగ్గుతాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు, ఎక్కువసేపు ఆసుపత్రిలో ఉండలేని వృద్ధులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది. లంగ్ క్యాన్సర్ బాధితుల్లో దాదాపు సగం మంది వరకు ఈ చికిత్సకు అర్హులు కావచ్చని అంచనా వేస్తున్నారు.
వివరాలు
ధరే పెద్ద అడ్డంకి..
అయితే రోగి శరీరంలో పీడీ-ఎల్1 స్థాయిలు ఎంత ఉన్నాయో పరీక్షించిన తర్వాతే వైద్యులు ఈ చికిత్సను సూచిస్తారు. క్యాన్సర్ దశను బట్టి ఇతర చికిత్సలతో కలిపి కూడా దీనిని ఇస్తారు. ఈ కొత్త చికిత్సలో ప్రధాన సమస్య ఖర్చు. ఒక్క ఇంజెక్షన్ ధర సుమారు రూ.3.7 లక్షలు. సాధారణంగా ఒక రోగికి ఆరు డోసుల వరకు అవసరం కావచ్చు. దీంతో మొత్తం ఖర్చు లక్షల్లోకి వెళ్లే అవకాశం ఉంది. మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఇది భారంగా మారుతోంది. అత్యాధునిక పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం కారణంగానే ఇమ్యునోథెరపీ ఔషధాలు అధిక ధరలకు అందుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి చికిత్సల ఒక్కో విడత ఖర్చు రూ.1.5లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటోంది.
వివరాలు
ధరే పెద్ద అడ్డంకి..
రోగులకు కొంత ఉపశమనం కలిగించేందుకు రోచ్ సంస్థ 'బ్లూ ట్రీ' పేరుతో ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే ఈ మందును కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిలో కూడా చేర్చారు. దీంతో కొంతమందికి తిరిగి ఖర్చు చెల్లించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఇలాంటి ఆధునిక వైద్యం సామాన్యులకు చేరాలంటే మరిన్ని రాయితీలు అవసరమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారీ ధర ఉన్నప్పటికీ క్యాన్సర్ రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ కొత్త ఇంజెక్షన్ కీలక మలుపుగా భావిస్తున్నారు.