#SankranthiSpecial: సంక్రాంతి స్పెషల్ 'బెల్లం అరిసెలు'.. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లోనూ పిండి వంటల హడావిడి మొదలవుతుంది. ఆ సంప్రదాయ వంటల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవి బెల్లం అరిసెలు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, రుచిగా ఉండే అరిసెలు సంక్రాంతి వేడుకలకు మరింత శోభను చేకూరుస్తాయి. అలాంటి సూపర్ టేస్టీ బెల్లం అరిసెలను ఇంట్లోనే సంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Details
కావాల్సిన పదార్థాలు
బియ్యం - 2 కిలోలు బెల్లం - 1½ కిలోలు నువ్వులు - 200 గ్రాములు ఏలకుల పొడి - 1టీ స్పూన్ నెయ్యి - 2టేబుల్ స్పూన్లు వంటనూనె - అవసరమైనంత బియ్యపిండి తయారీ విధానం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 12 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ప్రతి ఆరు గంటలకు ఒకసారి బియ్యాన్ని కడిగి, ఆ నీటిని పారబోసి మళ్లీ కొత్త నీటిని పోసి నానబెట్టాలి. అనంతరం నీటిని పూర్తిగా వడగట్టి, నీడలో పూర్తిగా ఆరబెట్టాలి. బియ్యం పూర్తిగా ఎండిన తర్వాత మెత్తగా పిండి చేసి జల్లెడ పట్టాలి. ఈ పిండి పూర్తిగా పొడిగా ఉండటం చాలా ముఖ్యం. ఇదే మంచి అరిసెలకు ప్రధాన రహస్యం.
Details
బెల్లం పాకం & అరిసెల పిండి తయారీ
బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించాలి. ఆ ద్రావణాన్ని వడకట్టి మళ్లీ మంటపై పెట్టి తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. పాకం సిద్ధమైన తర్వాత ఏలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ బెల్లం పాకాన్ని కొద్దికొద్దిగా బియ్యపిండిలో కలుపుతూ మృదువైన ముద్దలా చేయాలి. ఈ ముద్ద ఎక్కువ గట్టిగా గానీ, ఎక్కువ పలుచగా గానీ ఉండకూడదు.
Details
అరిసెలు కాల్చే విధానం
పొయ్యి వెలిగించి కడాయిలో నూనె వేడి చేయాలి. అరచేతికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకుని ముద్దను తీసుకొని నువ్వుల్లో ముంచి, నిదానంగా రౌండ్ ఆకారంలో ఒత్తుకోవాలి. ప్లాస్టిక్ కవర్‌పై లేదా బాదం ఆకులపై అరిసెలను ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయి. ఆ తర్వాత వాటిని మెల్లగా నూనెలోకి జారవిడిచి, బంగారు రంగు వచ్చేవరకు నెమ్మదిగా వేయించాలి.
Details
రుచికరమైన అరిసెల కోసం చిట్కాలు
వేయించిన తర్వాత రెండు అరిసెల గంటెలతో మెల్లగా ఒత్తి అదనపు నూనె తీసేయాలి. బియ్యపిండి పూర్తిగా పొడిగా ఉండాలి. బెల్లం పాకం తప్పకుండా తీగ పాకం దశలోనే ఉండాలి. నూనె మోస్తరు వేడి ఉండాలి. అరిసెలను ఎప్పుడూ నెమ్మదిగానే వేయించాలి. బెల్లం అరిసెలే సంక్రాంతి స్పెషల్ ఈ విధంగా సంప్రదాయ పద్ధతిలో చేసిన బెల్లం అరిసెలు సంక్రాంతి పండుగకు మరింత తియ్యదనాన్ని చేకూరుస్తాయి. ఇంట్లో తయారుచేసిన అరిసెలు కుటుంబ సభ్యులకు, అతిథులకు ప్రత్యేక ఆనందాన్ని అందిస్తాయి. కనుక ఈ సంక్రాంతికి ఇంట్లోనే రుచికరమైన బెల్లం అరిసెలు చేసి పండుగను మరింత మధురంగా జరుపుకోండి.