LOADING...
Sankranti Cockfights: పల్లెల్లో సంక్రాంతి హడావిడి.. కోడి పందేల సందడి.. జర భద్రం.!
పల్లెల్లో సంక్రాంతి హడావిడి.. కోడి పందేల సందడి.. జర భద్రం.!

Sankranti Cockfights: పల్లెల్లో సంక్రాంతి హడావిడి.. కోడి పందేల సందడి.. జర భద్రం.!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి అంటే సంబరాల పండుగ. పల్లెల్లో ఈ పండుగ రాగానే ఇంటింటా పిండివంటల ఘుమఘుమలు, ముంగిట రంగురంగుల ముగ్గులు, ఆకాశంలో ఎగిరే గాలిపటాలు, వీధుల్లో వినిపించే హరిదాసుల గానాలతో వాతావరణం ఉత్సాహంగా మారుతుంది. బసవన్న విన్యాసాలు,కర్రసాము,కత్తిసాము,డప్పు కళాకారుల హోరెత్తించే ప్రదర్శనలు, కోలాటం, పులివేషాలు వంటి కార్యక్రమాలతో గ్రామాలు కళకళలాడుతుంటాయి. ఈ అన్నింటికీ తోడు సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది కోడి పందేలే. గ్రామీణ సంస్కృతిలో కోడి పందేలు, ఎడ్ల పందేలు సాధారణ ఆటలుగా మాత్రమే కాకుండా ఓ ఉత్సవంగా,సామూహిక వేడుకగా భావిస్తారు. భోగి నుంచి కనుమ వరకూ పల్లెల్లో జరిగే ఈ పందేలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా జనం భారీగా తరలివస్తుంటారు.

వివరాలు 

కొందరికి ఇది సంప్రదాయం కాగా, మరికొందరికి వినోదం

ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. విదేశాల్లో నివసించే తెలుగువారిలో కూడా ఈ పందేలు ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంటాయి. అక్కడి హడావిడి, ఏర్పాట్లు, గెలుపు-ఓటముల ఉత్కంఠ పందేలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొందరికి ఇది సంప్రదాయం కాగా, మరికొందరికి వినోదం, ఇంకొందరికి గెలుపు ఓటముల ఉత్కంఠగా మారింది. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో కోడి పందేలతో సంబంధం ఉన్న ప్రమాదాలు పెరుగుతున్నాయి. కోడులకు కట్టే కత్తులు ప్రేక్షకులకు తగలడం, చిన్న విషయాలకే గొడవలు జరగడం,అవి దాడుల వరకు వెళ్లడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

వివరాలు 

భద్రతా కోణంలో పెద్ద చర్చ

కొన్ని సందర్భాల్లో గాయాలు, ప్రాణనష్టం కూడా జరుగుతున్నాయి.దీంతో ఈ సంప్రదాయం భద్రతా కోణంలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అందుకే కోడి పందేల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలు ఇవే: చాలా ప్రాంతాల్లో కోడి పందేలు చట్టపరంగా నిషేధించారు. కాబట్టి చట్టాన్ని గౌరవించడం అవసరం. లేదంటే పోలీస్ కేసులు,అరెస్ట్‌లు,జరిమానాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పందేల్లో అధిక మొత్తంలో డబ్బు పెట్టడం మంచిది కాదు. ఓటమి ఎదురైతే కుటుంబాల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. కోడిపందేల సమయంలో భారీగా జనసందోహం ఉంటుంది.కొంతమంది మద్యం మత్తులో గొడవలకు దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల భద్రత దృష్ట్యా ఈ పందేల నుంచి కొంత దూరంగా ఉండటమే ఉత్తమం.

Advertisement

వివరాలు 

జాగ్రత్తలు ఇవే:

పిల్లలను కోడి పందేల వద్దకు తీసుకెళ్లకుండా ఉండటం శ్రేయస్కరం. రక్తపాతం, హింసాత్మక దృశ్యాలు పిల్లల మనసుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పందేల్లో మాటల దూషణలు, వాగ్వాదాలు సాధారణం. అలాంటి గొడవల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. మొత్తానికి కోడి పందేల మోజులో పడి ప్రాణాపాయం, చట్టపరమైన చిక్కులు, కుటుంబ సమస్యలు తెచ్చుకోకుండా జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే సంక్రాంతి పండుగ నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.

Advertisement