Page Loader
Stairs Climbing Benefits: లిఫ్ట్‌కు గుడ్ బై చెప్పండి.. మెట్లు ఎక్కండి.. ఫిట్‌గా ఉండండి!
లిఫ్ట్‌కు గుడ్ బై చెప్పండి.. మెట్లు ఎక్కండి.. ఫిట్‌గా ఉండండి!

Stairs Climbing Benefits: లిఫ్ట్‌కు గుడ్ బై చెప్పండి.. మెట్లు ఎక్కండి.. ఫిట్‌గా ఉండండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత యుగంలో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందడంతో మనిషి శారీరక శ్రమకు దూరమవుతున్నాడు. లైఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, రిమోట్ కంట్రోల్స్, ఆన్‌లైన్ సేవలు ఇలా ప్రతిదీ సులభతరం కావడంతో శరీరాన్ని కదిలించాల్సిన అవసరం తగ్గిపోయింది. దాంతోనే అనేక రకాల జీవనశైలి రోగాలు మనల్ని వెంటాడుతున్నాయి. దీనిని తగ్గించాలంటే రోజువారీ జీవితంలో కొంత శారీరక శ్రమకు అవకాశం కల్పించుకోవాలి. అందులో ముఖ్యమైనదిగా చెప్పుకోవాల్సింది 'మెట్లు ఎక్కడం'. లైఫ్ట్‌లు, ఎస్కలేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, మెట్లు ఎక్కడాన్ని అలవాటు చేసుకోవడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.

Details

అధిక బరువు ఉన్నవారికి ఉపయోగకరం

ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో మెట్లు ఎక్కడం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వివిధ పరిశోధనల ప్రకారం, ప్రతి రోజు కేవలం 6 నిమిషాల పాటు మెట్లు ఎక్కితే శరీరంలో కొవ్వు శాతం సుమారు 15శాతం వరకు తగ్గుతుంది. జిమ్‌కి వెళ్లే సమయం లేకపోయినా, జాగింగ్ చేయాలన్న ఉత్సాహం లేకపోయినా, రోజువారీగా మెట్లు ఎక్కడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఇంతేకాదు, మెట్లు ఎక్కడం, దిగడం వల్ల కాళ్ళు, తొడలు, వెన్ను భాగంలో ఉండే కండరాలు బలపడతాయి. అట్లాగే, క్రమంగా 8 వారాల పాటు ఈ అలవాటును కొనసాగిస్తే శారీరక బలం 10% నుంచి 15% వరకు పెరుగుతుందట.

Details

మెట్లు ఎక్కడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మెట్లు ఎక్కడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో, కోలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇంకా, రోజూ కనీసం ఐదు సార్లు 15 మీటర్ల మేర మెట్లు ఎక్కితే సుమారు 302 కేలరీలు ఖర్చు అవుతాయట. ఇది జాగింగ్‌తో పోల్చితే ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. కాబట్టి వీలైనంత వరకు లిఫ్ట్‌ను తప్పించి మెట్లు ఎక్కడాన్ని అలవాటు చేసుకోండి. దీని వల్ల శారీరక శ్రమ పెరగడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.