LOADING...
Lord Shiva: అక్బర్ కలలో శివుడు.. కలానౌర్ శివలింగం వెనుక ఉన్న నిజం ఇదే!
అక్బర్ కలలో శివుడు.. కలానౌర్ శివలింగం వెనుక ఉన్న నిజం ఇదే!

Lord Shiva: అక్బర్ కలలో శివుడు.. కలానౌర్ శివలింగం వెనుక ఉన్న నిజం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 26, 2025
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

శివుణ్ని సాధారణంగా లింగరూపంలోనే భక్తులు పూజిస్తారు. దేవాలయాల్లో నిలువుగా ఉండే లింగాకారంలో పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. అయితే ఇందుకు భిన్నంగా పంజాబ్ రాష్ట్రం, గుర్‌దాస్‌పూర్‌ సమీపంలోని కలానౌర్‌లో శివలింగం అడ్డంగా ఉంది. కాశీ తరహా విశిష్టత కలిగిన ఈ ఆలయంలో భక్తులు శయన శివుడిని దర్శించి పూజలు నిర్వహిస్తారు. విభిన్న శివలింగం భగవంతుడికి ఎన్నో నామాలు, రూపాలు ఉన్నప్పటికీ, శివుడిని లింగ రూపంలోనే పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. సాధారణంగా లింగం పానవట్టంతో కలిసి నిలువుగా ఉంటుంది. కానీ కలానౌర్‌లోని మహాకాళేశ్వరుడి ఆలయంలో శివలింగం అడ్డంగా ఉండటం విశేషం. దీనికి ప్రత్యేకంగా పానవట్టం కనిపించదు. కైలాసం, కాశీ తర్వాత ప్రాముఖ్యత కలిగిన పవిత్ర క్షేత్రంగా ఇది భక్తుల విశ్వాసాన్ని చూరగొంటోంది.

Details

 కలలో శివుడు దర్శనం 

ఈ ప్రాంతం ఒకప్పుడు మొఘల్ చక్రవర్తి అక్బర్‌ పరిపాలనలో ఉండేది. 1556లో ఈ ప్రాంతంలో ఆయన సైనికులు గుర్రాలను కట్టేసి గుడారాలు వేసి తిరుగుతున్న సమయంలో ఓ విచిత్రమైన విషయం గమనించారు. గుర్రాలు ఒక ప్రదేశం మీదుగా నడవకపోవడంతో సైనికులు అక్బర్‌కు సమాచారమిచ్చారు. ఆయన స్వయంగా తన గుర్రంతో అక్కడికి వెళ్లగా, ఆ గుర్రం కూడా కదలకుండా నిలిచిపోయింది. దీంతో అక్కడ ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో అడ్డంగా ఉన్న శివలింగం బయటపడింది. అయితే రాత్రి కావడంతో మరుసటి రోజు మరింత తవ్వాలని అనుకున్నారు. ఆ రాత్రి అక్బర్‌ కలలో శివుడు దర్శనమిచ్చి, అక్కడ ఆలయం నిర్మించమని ఆదేశించాడట. ఈ ఆదేశం మేరకు అక్బర్‌ ఆలయం నిర్మించాడని స్థానికులు చెబుతారు.

Details

 ఆలయ పునర్నిర్మాణం 

అక్బర్‌ తర్వాత వచ్చిన మొఘల్‌ చక్రవర్తులు ఈ ఆలయాన్ని ఆక్రమించి, మసీదుగా మార్చారు. అయితే కొన్నేళ్ల తర్వాత రాజా రంజిత్‌ సింగ్‌ కుమారుడు ఖడఖ్‌ సింగ్‌ ఇక్కడికి వచ్చి, శివుడు తన కలలో దర్శనమిచ్చినట్లు చెప్పారు. ఆయన ఆదేశానుసారం ఆలయ పునరుద్ధరణ జరిపించారు. ప్రస్తుతం భక్తులను ఆకట్టుకునే ఈ ఆలయం అప్పుడు నిర్మించినదే. పురాణ గాథ గణాధిపత్యం కోసం గణేశుడు, కుమారస్వామి పోటీ పడగా, కుమారస్వామి అలిగి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకున్నాడు. దేవతలు ఎంత సముదాయించినా ఆయన మనసు మారలేదు. పరమేశ్వరుడే స్వయంగా ఇక్కడికి వచ్చి కుమారస్వామిని పరామర్శించాడట. శివుడు అడుగుపెట్టిన ఈ ప్రదేశం మహాకాళేశ్వరుడి ఆలయంగా ఏర్పడిందని స్థల పురాణం చెబుతోంది.

Details

ప్రత్యేక విశేషాలివే 

కలానౌర్‌లోని శయన శివుడి ఆలయంలో భక్తులు ప్రత్యేకంగా వెండి నాగపడగలను సమర్పిస్తారు. ఆలయంలో అమ్మవారితో పాటు గణపతి దర్శనం కూడా కలదు. ప్రతి మహాశివరాత్రి, ప్రత్యేకమైన మాసాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివునికి అభిషేకం, అర్చనలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో భక్తులు నిండు మనసుతో ఏదైనా మొక్కుకుంటే, శివుడు తప్పక నెరవేర్చుతాడని విశ్వసిస్తారు.