Speaking Multiple Languages: రెండు భాషలు నేర్చుకుంటే మెదడు యవ్వనంగా ఉంటుందా? కొత్త అధ్యయనం ఏమి చెబుతోందంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం వల్ల మెదడు వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగే వారి మెదడు, అదే వయస్సు ఉన్న ఒకే భాష తెలిసిన వారితో పోలిస్తే మరింత యవ్వనంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు, చిన్న వయస్సులోనే రెండో భాషను నేర్చుకోవడం, భాషపై మంచి పట్టు సాధించడం వల్ల ఈ ప్రయోజనం మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యయనం సూచిస్తోంది. ఈ పరిశోధన ఫలితాలను స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న ఫెడరేషన్ ఆఫ్ యూరోపియన్ న్యూరోసైన్స్ సొసైటీస్ సదస్సులో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
వివరాలు
నాలుగు భాషలు తెలిసిన వారి మెదడు.. 13 సంవత్సరాలు చిన్నదిగా..
అధ్యయనం ప్రకారం రెండు భాషలు మాట్లాడేవారి మెదడు సగటున ఆరు సంవత్సరాలు చిన్నదిగా కనిపించగా, మూడు భాషలు తెలిసిన వారి మెదడు ఏడు సంవత్సరాలు, నాలుగు భాషలు తెలిసిన వారి మెదడు దాదాపు 13 సంవత్సరాలు చిన్నదిగా ఉన్నట్లు గుర్తించారు. మన మెదడులో కోట్లాది నాడీకణాలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకుంటూ పనిచేస్తుంటాయి. అయితే వయస్సు పెరిగే కొద్దీ ఈ అనుసంధానం బలహీనపడటం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా వేగం క్రమంగా తగ్గుతాయి. అయితే బహుభాషా పరిజ్ఞానం ఉన్నవారిలో ఈ మార్పులు నెమ్మదిగా జరుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
వివరాలు
కృత్రిమ మేధ (AI) సహాయంతో నాడీ వ్యవస్థ వయస్సు అంచనా
ఈ అధ్యయనాన్ని స్పెయిన్, చిలీ, అర్జెంటీనా, ఐర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. స్పెయిన్‌లోని బాస్క్ ప్రాంతానికి చెందిన స్పానిష్, బాస్క్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషలు మాట్లాడే వ్యక్తులను ఎంపిక చేశారు. మొత్తం 728 మందిపై మెగ్నెటోఎన్‌సెఫాలోగ్రఫీ (MEG) సాంకేతికతతో మెదడు కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం కృత్రిమ మేధ (AI) సహాయంతో మెదడు అనుసంధాన స్థాయిని విశ్లేషించి నాడీ వ్యవస్థ వయస్సును అంచనా వేశారు. తర్వాత మరో 144 మందిపై కూడా ఇదే విధంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలను పోల్చిచూశారు.
వివరాలు
బాష నైపుణ్యం కలిగి ఉండటం.. మెదడు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో కీలక పాత్ర
ఈపరిశోధనలో పాల్గొన్న డాక్టర్ లూసియా అమోరుసో మాట్లాడుతూ,ఎక్కువ భాషలు మాట్లాడగలిగే వారి మెదడు వారి అసలు వయస్సుతో పోలిస్తే మరింత యవ్వనంగా కనిపించిందన్నారు. భాషల సంఖ్య మాత్రమే కాకుండా,రెండో భాషను చిన్న వయస్సులో నేర్చుకోవడం,దానిపై మంచి నైపుణ్యం కలిగి ఉండటం కూడా మెదడు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అంటే కేవలం రెండుభాషలు తెలిసి ఉండటం మాత్రమే కాదు, వాటిని ఎంతకాలంగా, ఎంత బాగా ఉపయోగిస్తున్నామన్నదీ ముఖ్యమని వివరించారు. అయితే ఈ పరిశోధనలో వయస్సు, లింగం, విద్య వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, జీవనశైలి,సామాజిక సంబంధాలు,చదివే అలవాటు,జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకోవడం, సంగీత వాయిద్యాలు నేర్చుకోవడం వంటి ఇతర అంశాల ప్రభావాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని పరిశోధకులు స్పష్టం చేశారు.
వివరాలు
ఇలా అయితే మెదడు ఎక్కువకాలం యవ్వనంగా ఉండే అవకాశాలు
ఈ ఫలితాలపై స్పందించిన ఏథెన్స్‌లోని నేషనల్ అండ్ కపోడిస్ట్రియన్ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరోసైంటిస్ట్ ప్రొఫెసర్ క్రిస్టినా డల్లా మాట్లాడుతూ, రెండో, మూడో లేదా నాలుగో భాషను నేర్చుకోవడం వల్ల మెదడు ఎక్కువకాలం యవ్వనంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఏ వయస్సులోనైనా కొత్త భాష నేర్చుకోవడం సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలతో పాటు మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని, అందుకే పాఠశాల స్థాయి నుంచి జీవితాంతం భాషల అభ్యాసాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
వివరాలు
ఇలా అయితే మెదడు ఎక్కువకాలం యవ్వనంగా ఉండే అవకాశాలు
అయితే లఫ్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన బయోలాజికల్ సైకాలజీ ప్రొఫెసర్ ఈఫ్ హోగర్వోస్ట్ మాత్రం ఈ ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. బహుభాషా పరిజ్ఞానం ఉన్నవారు సాధారణంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, పుస్తకాలు చదవడం, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం, సంగీత సాధన వంటి ఇతర అలవాట్లు కూడా కలిగి ఉండే అవకాశం ఉందని, మెదడు ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.