ట్రావెల్: శ్రీలంకలోని అతిపురాతన పట్టణం అనురాధపురంలో గల చూడదగ్గ ప్రదేశాలు
శ్రీలంకలోని అతి పురాతన పట్టణమైన అనురాధపుర గురించి మీరు వినే ఉంటారు. ప్రపంచ వారసత్వ సంపదగా ఈ పట్టణాన్ని యునెస్కో గుర్తించింది. ఇక్కడ చూడవలసిన పురావస్తు ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. స్మారక కట్టడాలు, ప్రసిద్ధమైన బోధి వృక్షం, పురాతన నిర్మాణాలు, టిస్సా వీవా సరస్సు, దేవాలయాలు, స్థూపాలు అనురాధపుర పట్టణంలో ప్రధాన ఆకర్షణ. బోధి వృక్షం: ఆధ్యాత్మికంగా సరికొత్త అనుభూతి పొందాలంటే బోధివృక్షం సందర్శించండి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన చెట్టుగా, ప్రపంచంలోనే అత్యంత వృద్ధ చెట్టుగా దీన్ని చెప్పుకుంటారు. ఈ పవిత్రమైన చెట్టును ఎన్నో ఏళ్ళుగా బౌద్ధులు కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకే దీన్ని ఖచ్చితంగా సందర్శించాలి. బుద్ధుడు జ్ఞానోదయం పొందింది ఈ చెట్టుకిందనే అని అక్కడి వారి నమ్మకం.
అనురాధపురలో చూడాల్సిన ప్రసిద్ధ ప్రదేశాలు
సిటీవాల్స్: పట్టణ రక్షణ కోసం, దుండగులు లోపలికి రాకుండా ఉండడం కోసం అనురాధపుర పట్టణం చుట్టూ పెద్ద పెద్ద గోడలు కనిపిస్తాయి. ఈ గోడలపై మత సంబంధిత ఛాయాచిత్రాలు కూడా కనిపిస్తాయి. టిస్సా వీవా సరస్సు: పట్టనం మధ్యలో ఉండే సరస్సు, పట్టణ వాసులందరికీ ప్రశాంతతను అందిస్తుంది. చుట్టూ ఆకుపచ్చని చెట్లు, సరస్సులో పడవ ప్రయాణం, చూడడానికి ఆనందించడానికి ముచ్చటగా ఉంటుంది. దేవాలయాలు, స్థూపాలు: ముందుగా చెప్పినట్టు ఈ పట్టణంలో దేవాలయాలు, స్థూపాలు ఎక్కువగా ఉంటాయి. అభయగిరి స్థూపం, కుట్టం పోకునా, రువాన్ వెలిసేయ డగోబా మొదలైన స్థూపాలు మీకు ఆసక్తిని కలిగిస్తాయి. మీకు చరిత్ర మీద ఆసక్తి ఉండి, ప్రపంచం తిరగాలన్న కోరిక ఉంటే అనురాదపుర పట్టణాన్ని సందర్శించడం మర్చిపోవద్దు.