LOADING...
Pista Pappu Benefits: గుప్పెడు పిస్తాలతో గుండెకు గట్టి రక్షణ

Pista Pappu Benefits: గుప్పెడు పిస్తాలతో గుండెకు గట్టి రక్షణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2025
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పుడూ బాదంపప్పే తింటున్నారా? ఈసారి పిస్తాలను కూడా ఆహారంలో చేర్చండి. గింజపప్పుల (నట్స్‌) వర్గానికి చెందిన పిస్తాలు పోషకాలతో నిండిన శ్రేష్టమైన ఆహారం. రోజుకు ఒక గుప్పెడు అంటే సుమారు 30 గ్రాముల పిస్తాలు తీసుకుంటే 159 కేలరీలు, 12.8 గ్రాముల కొవ్వు, 5.7 గ్రాముల ప్రొటీన్, 7.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల పీచు లభిస్తాయి. పిస్తాల్లో సమృద్ధిగా ఉండే విటమిన్‌ B6 రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల శరీరంలోని ప్రతి కణానికి తగినంత ఆక్సిజన్‌ అందుతుంది. రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేయడానికి కూడా ఇది దోహదపడుతుంది. ఇవే కాకుండా పిస్తాల్లో పొటాషియం మోతాదుగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Details

చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో సాయపడతాయి

ఇతర గింజపప్పుల్లో అరుదుగా లభించే ల్యూటీన్‌, జీయాగ్జాంతీన్‌ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పిస్తాల్లో ఉంటాయి. ఇవి కంటి రెటీనా మధ్యభాగాన్ని దెబ్బతినకుండా కాపాడుతూ చూపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పిస్తాల్లోని అసంతృప్త కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉన్న ఎల్‌-ఆర్జినైన్‌ అనే అమైనో ఆమ్లం శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలు విస్తరించేలా చేస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగవడమే కాకుండా లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడానికీ ఉపయోగపడుతుంది. పిస్తాలు నెమ్మదిగా జీర్ణమయ్యే గుణం కలవిగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు.

Details

పేగుల ఆరోగ్యానికి పిస్తాలు ఎంతో మేలు

పరగడుపున రక్తంలో గ్లూకోజు స్థాయిలు తగ్గడానికి, కణాలు ఇన్సులిన్‌కు మెరుగ్గా స్పందించడానికి ఇవి తోడ్పడతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే పేగుల ఆరోగ్యానికి కూడా పిస్తాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పీచు జీర్ణక్రియలో బ్యూటీరేట్‌ వంటి కొవ్వు ఆమ్లాలుగా మారుతుంది. ఇవి పెద్దపేగులోని కణాలకు అవసరమైన శక్తిని అందించి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.

Advertisement