Met Gala: మెట్ గాలాలో కలంకారీ 'జీవవృక్షం' దుస్తులతో సుధారెడ్డి మెరుపులు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూయార్క్‌లో నిర్వహించిన మెట్ గాలా వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త సుధారెడ్డి మరోసారి రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడు వేల సంవత్సరాల పురాతన మచిలీపట్నం కలంకారీ కళను ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్న 'జీవవృక్షం' శైలిలోని దుస్తులను ఆమె ధరించారు. ఈ దుస్తులను ప్రముఖ రూపకర్త రూపొందించగా, సంప్రదాయ నైపుణ్యానికి ఆధునిక శైలి కలగలిపిన ఆకృతి అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రత్యేక దుస్తుల తయారీలో తొంభై మంది కళాకారులు పాల్గొని, మొత్తం 3459 గంటల పాటు శ్రమించారు. ప్రతి అంచులోనూ కళాకారుల కృషి స్పష్టంగా కనిపించింది. నెట్ కప్పుపై భాగ్యనగరానికి చెందిన వృక్షాలు, జంతువుల ఆకృతులను రేష్మి జరీతో అద్భుతంగా నేసారు.
వివరాలు
లోహ వృక్ష ఆకృతి ప్రత్యేక ఆకర్షణ
దుస్తుల వెనుక భాగంలో అమర్చిన లోహ వృక్ష ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో తంగేడు పువ్వు, జమ్మిచెట్టు, సూర్యుడు, చంద్రుడు, కల్పవృక్ష చిత్రాలను ప్రతిబింబిస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ, భారతదేశం, తెలంగాణకు చెందిన సంప్రదాయ కళలను అంతర్జాతీయ వేదికలపై ప్రాచుర్యం పొందేలా చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. గత సంవత్సరం కూడా ఆమె ఇలాంటి ప్రత్యేక ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు.