మద్యాహ్నం కునుకు మంచిదే? దాని లాభాలు తెలుసుకోండి
మద్యాహ్నం కునుకు వల్ల మెదడు పనితీరులో చాలా మార్పులు వస్తాయి. తినగానే కళ్ళు మూసుకుపోతుంటే పెద్దగా ఆలోచించకుండా కొంత సమయం పాటు కునుకు తీయండి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కునుకు అనేది 30నిమిషాల లోపే ఉండాలి. గంటలు గంటలు నిద్ర పోకూడదని గుర్తుంచుకోండి. ప్రస్తుతం కునుకు వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం. జ్ఞాపకశక్తిని పెంచుతుంది: మీరు విన్నది నిజమే, మద్యాహ్నం కునుకు వల్ల మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పనిచేసే ఉత్సాహం పెరుగుతుంది: ఎక్కువ సేపు పనిచేసినపుడు మానసికంగా అలసట వస్తుంది. అది దూరం కావాలంటే చిన్నపాటి కునుకు ఖచ్చితంగా అవసరం. నిరుత్సాహాన్ని దూరం చేయడంలో మద్యాహ్నం కునుకు మంచి పాత్ర వహిస్తుంది.
పనిలో చురుకుగా, మనసును ప్రశాంతంగా ఉంచే మద్యాహ్నం కునుకు
చురుకుదనాన్ని పెంచుతుంది: చిన్న కునుకుతో పెద్ద లాభాలుంటాయి. మద్యాహ్నం పూట పనిలో ఆసక్తి లేకపోతే ఒక చిన్న కునుకు తీయండి. దానివల్ల బాడీలో చురుకుదనం వచ్చేసి యాక్టివ్ గా మారిపోతారు. క్రియేటివిటీ పెంచుతుంది: మీలో క్రియేటివిటీ ఉప్పొంగాలంటే మద్యాహ్నం కునుకు తీయండి. గొప్ప శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ కొత్త కొత్త ఆలోచనలు రావడం కోసం మద్యాహ్నం కునుకు తీసేవాడట. మీ మూడ్ బాలేనపుడు, ఏ పనీ చేయాలనిపించకపోతే మద్యాహ్నం నిద్రపోండి. ఈ కునుకు వల్ల మీపైనున్న ఒత్తిడి, దానివల్ల కలిగే యాంగ్జాయిటీ అన్నీ దూరమైపోయి ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని లాభాలున్నాయని తెలిసిన తర్వాత మద్యాహ్నం కునుకు తీయడానికి ఆలోచించకుండా హాయిగా నిద్రపోండి. దానివల్ల కలిగే లాభాలు అనుభవించి ఆరోగ్యాన్ని పొందండి.