మీకు నిద్ర సరిగా ఉండట్లేదా? ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి
పొద్దున్న నిద్రలోంచి లేవాలని అనిపించకపోవడం, అలాగే రాత్రి నిద్ర పట్టకపోవడం చాలామందికి జరుగుతుంటుంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మీరు చేసే పొరపాట్లే మీ నిద్ర భంగానికి కారణాలుగా నిలుస్తాయి. సమయానికి పడుకోకపోవడం: ఒకరోజు రాత్రి 10గంటలకు పడుకుని మరుసటి రోజు రాత్రి 12గంటలు పడుకోవడం వల్ల బాడీకి మీరు ఏ టైమ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారో అర్థం కాదు. అందుకే సరైన నిద్రా సమయాన్ని మీరు ఎంచుకోండి. స్మార్ట్ ఫోన్ వాడకం: నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ వాడటం అందరికీ అలవాటు. కానీ మీకు నిద్రను దూరం చేసేది అదే. అదే పనిగా ఫోన్ వాడటం వల్ల కళ్ళు అలసిపోతాయి. నిద్ర తొందరగా రాదు. దానివల్ల తెల్లవారు జామున తొందరగా లేవలేరు.
నిద్ర రాకపోవడానికి గల కారణాలు
మద్యాహ్నం నిద్రపోవడం: చిన్నపాటి కునుకు అని చెప్పి గంటలు గంటలు మద్యాహ్నాలు నిద్రపోతే రాత్రి నిద్రపట్టదు. కునుకు అనేది అరగంట కంటే ఎక్కువ ఉండకూడదు. అది కూడా సాయంత్రం 4గంటల లోపలే ఉండాలని గుర్తుంచుకోండి. ఆహార అలవాట్లు: మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేది ఆహారమే. నిద్రపోయే ముందు టీ, కాఫీ, చక్కెర పదార్థాలు తినకూడదు. వీటివల్ల శరీరంలోని రసాయన చర్యల్లో మార్పులు జరిగి నిద్ర దూరమవుతుంది. మానసిక ఒత్తిడి: సమాజంలో ఉన్నప్పుడు ఒత్తిడి సహజం. జాబ్ గురించో, లైఫ్ గురించో ఎప్పుడూ ఏదో ఒక ఒత్తిడి ఉండనే ఉంటుంది. కానీ ఏ ఒత్తిడైనా మనం తీసుకునే దాని మీదే ఆధారపడి ఉంటుంది. దేని గురించి ఎంత బాధపడాలనేది తెలుసుకుంటే బాగుంటుంది.