Unniyappam: ఆలయ ప్రసాదం రుచి ఇంట్లోనే.. కరకరలాడే కేరళ 'ఉన్నిఅప్పం' తయారీకి ఈజీ రెసిపీ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ టూర్‌కు వెళ్లినప్పుడు ఆలయాల్లో లభించే ప్రసాదాల రుచి ఇప్పటికీ గుర్తుందా? ముఖ్యంగా శబరిమల అయ్యప్ప మాల ధారులు అక్కడ తప్పక రుచి చూసే అరవణ ప్రసాదంతో పాటు ఉన్నిఅప్పం (Unniyappam) ప్రత్యేక స్థానం దక్కించుకుంటుంది. కాస్త తియ్యగా, బయట కరకరలాడుతూ లోపల మృదువుగా ఉండే ఈ అప్పం రుచి చిన్నారులైతే అస్సలు మర్చిపోలేరు. మంచి విషయం ఏమిటంటే.. ఈ కేరళ స్పెషల్ ఉన్నిఅప్పాన్ని ఇంట్లోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అరటి పండ్లు, బెల్లం, కొద్దిగా కొబ్బరి తురుము ఉంటే చాలు... కేవలం అరగంటలో రుచికరమైన ఉన్నిఅప్పం రెడీ.
Details
కావాల్సిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు బెల్లం తురుము - ముప్పావు కప్పు నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము - అర కప్పు యాలకులు - 4 అరటి పండ్లు - 2 ఉప్పు - చిటికెడు నల్ల నువ్వులు - 1 టేబుల్ స్పూన్ వంట సోడా - కొద్దిగా
Details
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినంత నీళ్లు పోసి సుమారు 3 గంటల పాటు నానబెట్టాలి. సాధారణంగా ఇంట్లో వాడే బియ్యం లేదా రేషన్ బియ్యం ఏవైనా ఉపయోగించవచ్చు. తర్వాత ఓ గిన్నెను పొయ్యిపై పెట్టి, అందులో బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి సన్నని మంటపై కరిగించాలి. పూర్తిగా కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మరో ప్యాన్‌లో నెయ్యి వేసి, అందులో కొబ్బరి తురుము వేసి దోరగా వేయించాలి. నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అందులో యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత అదే మిశ్రమంలో అరటి పండ్లు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి.
Details
తయారీ విధానం 1/2
ఇప్పుడు బెల్లం పాకం, చిటికెడు ఉప్పు వేసి మళ్లీ మెత్తగా గ్రైండ్ చేసి మిశ్రమాన్ని ఓ మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో వేయించిన కొబ్బరి తురుము, నల్ల నువ్వులు, కొద్దిగా వంట సోడా వేసి బాగా కలిపి సుమారు గంట పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు గుంతలున్న పొంగనాల గిన్నెను స్టవ్‌పై పెట్టి,ప్రతి గుంటలో కొద్దిగా నూనె రాయాలి. సిద్ధంగాఉన్న పిండిని గుంటల్లో పోసి మీడియం మంటపై ఒక వైపు బాగా కాల్చాలి. తర్వాత మరో వైపు తిప్పి కాల్చుకుంటే కరకరలాడే ఉన్నిఅప్పం రెడీ. ఈ ఉన్నిఅప్పం రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఒకసారి తప్పకుండా ఇంట్లోనే తయారు చేసి చూడండి...కేరళ ఆలయ ప్రసాదం రుచి మీ వంటింట్లోనే ఆస్వాదించవచ్చు.