Summer: వేసవి వేడి ప్రభావం.. భానుడి తీవ్రత నుంచి ఎలా రక్షించుకోవాలి?
ఈ వార్తాకథనం ఏంటి
రోజురోజుకు ఎండలు మరింత ఉధృతమవుతున్నాయి. గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు 33-35 డిగ్రీలకు పైగా చేరుతున్నాయి.
ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. పరీక్షలు, ఉద్యోగాలు, ఇతర అవసరాల కోసం బయట తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీని వల్ల నీరసం, నిస్సత్తువ చుట్టుముట్టుతోంది.
ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి త్వరగా గురవుతారు.
డీహైడ్రేషన్ సమస్యకు దారి తీసే వడదెబ్బను నివారించేందుకు ఇంట్లో ఉన్నవాళ్లూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Details
ఎండ ప్రభావం తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంట్లో చల్లదనాన్ని కాపాడుకోండి
ఏసీ, ఫ్యాన్ లేదా కూలర్లను వాడి చల్లని ప్రదేశంలో ఉండాలి. ఇంట్లోకి వేడి గాలులు రాకుండా కర్టెన్లు వాడాలి.
శరీరానికి తగినంత ద్రవపదార్థాలు అందించండి
రోజూ 7-8 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి. ఉప్పు కలిపిన నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకుంటే శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. ఇవి వడదెబ్బను నివారించడంలో సాయపడతాయి.
సౌకర్యవంతమైన దుస్తులను ధరించండి
ఎండాకాలంలో వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించడం మంచిది. ఇవి చెమటను పీల్చుకోవడంతో శరీరం చల్లబడటానికి సాయపడతాయి.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో తిరగకపోవడం ఉత్తమం. బయటకు వెళ్ళాల్సి వస్తే తలకు టోపీ, కళ్లకు కూలింగ్ గ్లాసులు ధరించాలి.
Details
సురక్షితమైన తాగునీటిని మాత్రమే ఉపయోగించండి
వేసవిలో కలుషిత నీటివల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగకూడదు. ఇంటి నుంచి బాటిల్ నీటిని తీసుకెళ్లడం ఉత్తమం.
ఆహార పరంగా జాగ్రత్తలు పాటించండి
అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. అందుకే బయట తినడం తగ్గించి, తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
మద్యం, అధిక కాఫీ, టీ మానేయండి
వేసవిలో మద్యం, అధికంగా కాఫీ, టీ సేవించడం డీహైడ్రేషన్‌ను మరింత పెంచుతుంది. బదులుగా తేలికపాటి తాగునీరు తీసుకోవడం ఉత్తమం. ఓఆర్‌ఎస్ కలిపిన నీరు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు.
Details
ఆరోగ్య సమస్యలున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి
మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు ఎండ వేడి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డీహైడ్రేషన్ సమస్య రాకుండా శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. బీపీ రోగులు వైద్యుల సూచన మేరకు మందుల డోస్‌ను సరిచూసుకోవాలి.
వెంటనే వైద్య సహాయం తీసుకోండి
ఎండ వేడిని తట్టుకోలేక వాంతులు, విరేచనాలు, అపస్మారక స్థితి అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
వ్యాయామం, జిమ్ జాగ్రత్తలు
ఉదయాన్నే నడకకు వెళ్లేవారు ఎండవచ్చేలోపు తిరిగి రావాలి. గంటల తరబడి వ్యాయామం చేయడం వల్ల చెమట ద్వారా శరీరంలో నీరు పోయి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
గరిష్టంగా 30-40 నిమిషాల వరకు మాత్రమే వ్యాయామం చేయడం మంచిది. జిమ్ చేసే వారు నిపుణుల సూచనలు తీసుకోవాలి.