రాఖీ పండగ: మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు పండగలో వస్తున్న ఈ మార్పులు గమనించారా?
పండగ అంటే ప్రతీ ఇంట్లో సంతోషం, ఆనందం వెల్లువిరిస్తాయి. పండగరోజు ప్రతీ ఇల్లు ఎంతో కళగా ఉంటుంది. వచ్చీ పోయే చుట్టాలు, ఆత్మీయులతో ఎంతో సందడిగా ఉంటుంది. అయితే కాలం మారుతున్న కొద్దీ పండగల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం రాఖీ పండగలో వచ్చిన అలాంటి మార్పులు ఏంటో తెలుసుకుందాం. తరిగిన దూరం: పండగ రోజున ఆత్మీయులు దూరంగా ఉన్నా కూడా ప్రస్తుతం అప్డేట్ చెందిన టెక్నాలజీ కారణంగా ఫోన్లలో మాట్లాడుతూనో, వీడియో కాల్స్ సాయంతోనో పండగ జరుపుకుంటున్నారు. కొరియర్ ద్వారా రాఖీలు పంపించి, వీడియో కాల్స్ లో హారతి ఇచ్చేస్తున్నారు. పండగ పూట ఆత్మీయులు దూరంగా ఉన్నారన్న బాధ ఈ విధంగా తగ్గిపోతుంది.
రాఖీ పండగలో వచ్చిన మార్పులు
కేవలం అన్నాతమ్ముళ్ళకే కాదు: రాఖీ అంటే అన్నయ్యకో, తమ్ముడికో కట్టేవారు. కానీ ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. చెల్లెళ్ళకు, అక్కలకు రాఖీ కడుతున్నారు. ప్రస్తుత జెనరేషన్ లో వచ్చిన అతిపెద్ద మార్పు ఇది. నచ్చినట్టుగా రాఖీల తయారీ: గతంలో మార్కెట్ లో దొరికిన రాఖీలనే కొనాల్సి ఉండేది. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా రాఖీలు తయారు చేసే సంస్థలు పెరిగాయి. ఆన్ లైన్ లో ఇలాంటి ఆప్షన్స్ బోలెడు ఉన్నాయి. మీరు ఎవరికైతే రాఖీ కట్టాలనుకుంటున్నారో వారికి నచ్చిన అంశంలో రాఖీని తయారు చేయించవచ్చు. వంటకాల్లో మార్పులు: గ్లోబలైజేషన్ కారణంగా వంటకాల్లో మార్పులు వస్తున్నాయి. రాఖీ పండగ రోజున వివిధ రకాల వంటలను చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ
రాఖీలను మొక్కలకు కూడా కడతారని మీకు తెలుసా? మొక్కలను కాపాడతానని, దానివల్ల పర్యావరణాన్ని రక్షిస్తానని చెప్పేందుకు మొక్కలకు రాఖీ కడుతున్నారు. ఈ విధంగా పర్యావరణం మీద చాలామందికి శ్రద్ధ పెరిగింది. బహుమతుల్లో వచ్చిన మార్పు: రాఖీ కట్టిన తర్వాత అన్నా తమ్ముళ్ళు ఏదో ఒక బహుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బహుమతుల్లో ఇప్పుడు మార్పు వచ్చింది. సమాజానికి సేవ చేసే విధంగా బహుమతులు అందించడం ఈ మధ్య బాగా పెరుగుతోంది.