Crystal Clear Beach: ఇండియాలోనూ క్రిస్టల్ క్లియర్ బీచ్‍లు.. ఎక్కడ, ఎలా వెళ్లాలంటే?
భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో అనేక అందమైన బీచ్‌లు ఉన్నాయి.ఇవి చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. కానీ క్రిస్టల్ క్లియర్ నీటితో ఉన్న బీచ్‌లను అన్వేషించే పర్యాటకులు తరచుగా మాల్దీవుల లేదా బాలీలకు వెళ్ళాలని ఆశపడతారు. అయితే, ఇండియాలో కూడా కొన్ని క్రిస్టల్ క్లియర్ వాటర్ బీచ్‌లు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులలో కొన్ని అత్యంత అందమైన బీచ్‌లు ఉన్నాయి, వాటిలో రెండు బీచ్‍ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
రాధానగర్ బీచ్
హావెలాక్ ఐల్యాండ్ (స్వరాజ్ దీప్)లో ఉన్న రాధానగర్ బీచ్ అనేక ప్రత్యేకతలతో ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్ స్వచ్ఛమైన నీరు, తెల్లటి ఇసుక, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది. సముద్రపు నీరు నీలం రంగులో, క్రిస్టల్ క్లియర్‌గా ఉంది. ఈ బీచ్ ఆసియాలోనే ఒక బెస్ట్ బీచ్‌గా గుర్తించబడింది. ఇక్కడ పర్యాటకులు సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు, అలాగే సముద్రంలో స్విమ్మింగ్, సన్ బాతింగ్ చేయడం మర్చిపోలేని అనుభవం. ఈ బీచ్ దగ్గర పర్యాటకులు ఉండేందుకు వివిధ రకాల ఆప్షన్లు ఉంటాయి, కానీ బీచ్ అందాన్ని కాపాడేందుకు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అందుబాటులో ఉండవు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో రాధానగర్ బీచ్‌కి సందర్శనకు అత్యుత్తమ సమయం.
నీల్ ఐల్యాండ్ బీచ్‌లు
అండమాన్ నికోబార్ దీవులలోని నీల్ ఐల్యాండ్‌లోని బీచ్‌లు కూడా క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్‌తో అందంగా ఉంటాయి. ఈ ఐల్యాండ్‌లోని సీతాపూర్, లక్ష్మణ్ పూర్, భరత్‌పూర్ బీచ్‌లు ప్రత్యేకమైన అందాన్ని కలిగివున్నాయి. ఇవి పర్యాటకులను ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆకట్టుకుంటాయి. ప్రయాణ మార్గాలు హైదరాబాద్ నుంచి అండమాన్ నికోబార్ దీవులకు విమానంలో వెళ్లాలంటే, పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. పోర్ట్ బ్లెయిర్ నుంచి షిప్ ద్వారా హావెలాక్, నీల్ తదితర ఐల్యాండ్‌లకు వెళ్లవచ్చు.
ప్రయాణ మార్గాలు
ప్రయాణం దూరాన్ని బట్టి ఒక నుంచి మూడు గంటల వరకు ఉంటాయి. రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా కూడా పర్యాటకులు అండమాన్ నికోబార్ దీవులకు చేరవచ్చు. ముందుగా విశాఖపట్నం లేదా చెన్నైకు వెళ్లి అక్కడి నుంచి క్రూజ్ షిప్ ద్వారా సముద్ర ప్రయాణం ప్రారంభించవచ్చు. ఈ ప్రయాణం సుమారు మూడు రోజుల వరకు కొనసాగుతుంది. అలాగే, కోల్‌కతా నుంచి కూడా క్రూజ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, అయితే ఈ ప్రయాణం నాలుగు రోజులు వరకు సాగుతుంది.