LOADING...
New Year Resolutions: న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌ లు విఫలమయ్యే అసలు కారణాలు ఇవే!
న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌ లు విఫలమయ్యే అసలు కారణాలు ఇవే!

New Year Resolutions: న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌ లు విఫలమయ్యే అసలు కారణాలు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2025
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త సంవత్సరం మొదలవుతుందంటే సహజంగానే మనసులో తెలియని ఉత్సాహం, ఆనందం పుట్టుకొస్తాయి. ఈ ఏడాది నుంచైనా బరువు తగ్గాలి, క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లాలి, పొదుపు పెంచాలి, చెడు అలవాట్లకు చెక్ పెట్టాలి, మొబైల్‌ వినియోగం తగ్గించాలి అంటూ చాలామంది అనేక నిర్ణయాలు తీసుకుంటారు. జనవరి ఒకటో తేదీన కొత్త ఉత్సాహంతో ఆరంభిస్తారు. అయితే, కొన్ని రోజులు గడిచాక ఆ సంకల్పాలన్నీ మసకబారిపోతాయి. చివరికి "వచ్చే ఏడాది చూద్దాం" అంటూ వాయిదా వేసుకుంటారు. అసలు న్యూ ఇయర్‌ రిజల్యూషన్స్‌ ఎందుకు నిలబడవు? వాటి వెనుక ఉన్న కారణాలేంటి? లక్ష్యాలు నిజమవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

లక్ష్యాల ఎంపిక

కొత్త ఏడాదితో పాటు జీవితమే పూర్తిగా మారిపోవాలని చాలామంది కోరుకుంటారు. అందుకే పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వినడానికి అవి బాగానే అనిపిస్తాయి కానీ, అమలు చేయడం కష్టం. వ్యాయామం చేయాలి, డైట్‌ పాటించాలి అనుకోవడం మంచి ఆలోచనే. అయితే మొదటిరోజే అతిగా మొదలుపెడితే, కొద్ది రోజుల్లోనే "ఇది నా వల్ల కాదు" అంటూ మధ్యలోనే ఆపేస్తారు. లక్ష్యాలు ఎప్పుడూ సాధ్యపడేలా ఉండాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలంటే వ్యాయామం, ఆహార నియమాలు అవసరమే. కానీ, తొలినాళ్లలోనే కఠినమైన నియమాలు పెట్టుకోకూడదు. చిన్న చిన్న లక్ష్యాలతో ప్రయాణం ప్రారంభించాలి. ఉదాహరణకు గంటపాటు నడవాలనుకుంటే, మొదట 10 నిమిషాలతో మొదలుపెట్టి క్రమంగా సమయం పెంచుకుంటూ వెళ్లాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

వివరాలు 

క్రమశిక్షణ

కొత్త ఏడాది తెచ్చే ఉత్సాహం ఎక్కువకాలం నిలవదు. అదే విధంగా రిజల్యూషన్స్‌పై ఆసక్తి కూడా రోజులు గడిచే కొద్దీ తగ్గిపోతుంది. నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా చాలామంది వాటిని త్వరగానే పక్కన పెడతారు. కానీ, నిర్ణయాలు నిలబడాలంటే క్రమశిక్షణ అత్యంత అవసరం. అనుకున్న పనిని రోజువారీ జీవితంలో భాగంగా మార్చుకోవాలి. కొన్ని రోజులు ఒకే సమయానికి, ఒకే విధంగా పట్టుదలతో చేస్తే అవే అలవాట్లుగా మారిపోతాయి.

Advertisement

వివరాలు 

ప్రణాళిక అవసరం

చాలామంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ, వాటిని ఎలా అమలు చేయాలన్న దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉండదు. ఉదాహరణకు బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారు అనుకోండి. దానికి ఏం చేయాలి? నడక చేయాలా? జిమ్‌లో వ్యాయామం చేయాలా? యోగాసనాలు వేయాలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుండవు. దీంతో "తర్వాత చూద్దాం" అంటూ వదిలేస్తారు. ప్రణాళిక లేకుండా ఏ పని సక్రమంగా పూర్తవదు. అందుకే తీసుకున్న రిజల్యూషన్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదానిపై ముందే ఆలోచించాలి. వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్లాలా లేదా ఇంట్లోనే చేయాలా నిర్ణయించుకోవాలి. అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రయాణం చేయాలనుకుంటే గమ్యస్థానాన్ని నిర్ణయించి, దానికి కావాల్సిన ఖర్చును ముందుగానే పొదుపు చేయడం మొదలుపెట్టాలి.

Advertisement

వివరాలు 

ఒక్కసారి మిస్‌ అయితే

వ్యాయామం కావచ్చు, డైట్‌ కావచ్చు, పొదుపు కావచ్చు—జనవరిలో ఎంతో ఉత్సాహంగా మొదలుపెడతారు. కొన్ని రోజులు క్రమం తప్పకుండా కొనసాగిస్తారు. కానీ, ఒక్కరోజు మిస్‌ అయితే, "ఇక అంతా వృథా అయిపోయింది" అనే భావనకు వచ్చేస్తారు. ఆ ఒక్కరోజు తప్పిన తర్వాత మళ్లీ మొదలుపెట్టాలనే ఆలోచన రాదు. ఒక్కరోజు జిమ్‌కు వెళ్లకపోయినా, డైట్‌ పాటించకపోయినా, పొదుపు చేయకపోయినా ఎలాంటి పెద్ద నష్టం జరగదని గుర్తుంచుకోవాలి. మరుసటి రోజు మళ్లీ మొదలుపెడితే చాలు. లక్ష్యం నెరవేరేవరకు నిరంతర ప్రక్రియలా కొనసాగించడమే ముఖ్యం.

వివరాలు 

పోలికలు వద్దు

ప్రతి వ్యక్తి ఒకేలా ఉండడు. అలాగే వారి సమయం, శక్తి, ఆర్థిక స్థితి, అవసరాలు కూడా వేర్వేరు. ఎవరో విదేశీ ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి, అదే రిజల్యూషన్‌ను మనమూ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఆర్థిక పరిస్థితిని, సామర్థ్యాన్ని ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా విఫలమవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన లక్ష్యాలనే ఎంచుకోవాలి.

వివరాలు 

ఈ చిట్కాలు ఉపయోగపడతాయి

మీ రిజల్యూషన్స్‌ను ఒక డైరీలో రాసుకొని, రోజూ సాధించిన వాటికి టిక్‌ పెట్టుకోవచ్చు. లేదా ఫోన్‌లో రిమైండర్‌ పెట్టుకొని క్రమం తప్పకుండా చూసుకోవచ్చు. వారం రోజులకు ఒకసారి మీ పురోగతిని సమీక్షించుకుని, మంచి ఫలితాలు కనిపిస్తే మీకు మీరే చిన్న బహుమతి ఇచ్చుకోవచ్చు. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాల గురించి కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పాలి. సాధించిన ఫలితాలను వాళ్లతో పంచుకుంటే, అవసరమైనప్పుడు వాళ్లే గుర్తుచేస్తూ ప్రోత్సహిస్తారు.

Advertisement