Corn: గుండె నుంచి కంటివరకు మేలు చేసే ఎంచక్కని మొక్కజొన్న
ఈ వార్తాకథనం ఏంటి
వాన చినుకులు పడుతుంటే... కాల్చిన మొక్కజొన్న పొత్తులను వేడివేడిగా తినే ఆనందమే వేరు. రుచికే కాదు, ఆరోగ్యానికీ ఇవి మేలు చేస్తాయి. మొక్కజొన్న గింజల్లో నీటిలో కరగని పీచు పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజు ఒక్కసారిగా పెరగకుండా మెల్లగా కలుస్తుంది. కాల్చుకుని, ఉడికించి, పచ్చిగానే కాకుండా కార్న్ ఫ్లేక్స్, పాప్‌కార్న్ రూపంలోనూ మొక్కజొన్నను ఆస్వాదించవచ్చు. మరి మొక్కజొన్న తింటే లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
Details
జీర్ణక్రియకు మేలు
మొక్కజొన్నలో ఉండే కరగని పీచు మలం సరిగ్గా ఏర్పడేందుకు సాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. గింజల లోపలి పలుచని పొరల్లో ముఖ్యమైన విటమిన్లు, పోషకాలు, పీచు ఉంటాయి. ఇవి శరీరానికి బాగా అందుతాయి. అయితే వెలుపలి గట్టి పొరలోని సెల్యులోజ్ జీర్ణం కాదు. ఇది పేగుల్లో పులిసిపోవడం వల్ల ఎక్కువగా తిన్నప్పుడు పొట్ట ఉబ్బినట్టు అనిపించొచ్చు. మరోవైపు మొక్కజొన్నలోని పీచు ప్రిబయాటిక్‌లా పనిచేసి పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగటానికి దోహదం చేస్తుంది. ఈ బ్యాక్టీరియా మొక్కజొన్నను షార్ట్ చెయిన్ కొవ్వు ఆమ్లాలుగా మార్చి పెద్దపేగు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.
Details
కంటి ఆరోగ్యానికి
ఒక మొక్కజొన్న పొత్తులోని గింజల్లో సుమారు 900 మైక్రోగ్రాముల యాంటీఆక్సిడెంట్లు (ల్యుటీన్, జియాగ్జాంతీన్) ఉంటాయి. ఇవి చూపును మెరుగుపరచడంలో, కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా యాంటీఆక్సిడెంట్లు దీర్ఘకాల వాపు, గుండెజబ్బులు, క్యాన్సర్లకు కారణమయ్యే విశృంఖల కణాల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
Details
గుండెకు రక్షణ
మొక్కజొన్న గింజలతో తయారయ్యే నూనెలో ఫైటోస్టెరాల్స్ అనే సహజ వృక్ష పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరం కొలెస్ట్రాల్‌ను తక్కువగా గ్రహించేలా చేస్తాయి. అలాగే గుండెకు మేలు చేసే యుబిక్వినోన్ అనే విటమిన్ కూడా ఇందులో ఉంటుంది. ఇది గుండె కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. పరిమిత మోతాదులో వాడితే మొక్కజొన్న నూనె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులోని బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు మంచి శక్తినీ అందిస్తాయి.
Details
గ్లూకోజుపై ప్రభావం తక్కువ
మొక్కజొన్నకు సహజంగా ఉండే తీపి రుచి గింజల్లోని చక్కెరల వల్ల వస్తుంది. అయితే ఈ చక్కెర మోతాదు చాలా తక్కువే. ఒక మాదిరి పొత్తులో సుమారు 4గ్రాముల సహజ చక్కెర మాత్రమే ఉంటుంది. ఇది ఎర్రటి యాపిల్‌తో పోలిస్తే మూడో వంతు కన్నా తక్కువ. గ్లుటెన్ లేని ఆహారం మొక్కజొన్నలో గ్లుటెన్ ఉండదు. అందువల్ల సీలియాక్ వ్యాధిగలవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. అయితే మొక్కజొన్నతో తయారయ్యే కొన్ని ప్రాసెస్డ్ ఆహారాల్లో గ్లుటెన్ కలిపే అవకాశం ఉంటుంది.కాబట్టి ప్యాకెట్‌పై ఉన్న పోషక వివరాలను తప్పకుండా చూసుకోవాలి. పోషకాల గని పీచు, యాంటీఆక్సిడెంట్లతో పాటు మొక్కజొన్న గింజల్లో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు దాగున్నాయి.
Details
సుమారు అరకప్పు మొక్కజొన్న గింజలతో లభించే పోషక విలువలు ఇవీ
97 కేలరీలు 23.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు 0.78 గ్రాముల కొవ్వు 2 గ్రాముల పీచు 3 గ్రాముల ప్రొటీన్ 5 మి.గ్రా. సోడియం 4 మి.గ్రా. క్యాల్షియం 40 మైక్రోగ్రాముల ఫోలేట్ 32 మి.గ్రా. మెగ్నీషియం 294 మి.గ్రా. పొటాషియం 244 ఐయూ విటమిన్ ఏ 7 మి.గ్రా. విటమిన్ సి అందుకే వానకాలంలో వేడి వేడి మొక్కజొన్న రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే ఆహారంగా నిలుస్తోంది.