
Jungle Safari: పిల్లలతో కలిసి అడవి సఫారీకి వెళ్తున్నారా? ఇలా ప్లాన్ చేస్తే రెండు రెట్లు మజా!
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి సెలవులు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేయాలని ఉవ్విళ్లూరుతారు.
ముఖ్యంగా పిల్లలకు సరదాగా గడిపేలా చేయాలని,వారిలో ఆసక్తిని పెంచేలా జంగిల్ సఫారీ వంటివి ప్లాన్ చేస్తుంటారు.
మీరు కూడా ఈసారి మీ చిన్నారులతో అడవి పర్యటనకు వెళ్తున్నట్లయితే, ఈ సూచనలు మీ ప్రయాణాన్ని మరింత ఉల్లాసంగా మార్చుతాయి.
#1
దుస్తుల ఎంపిక విషయంలో జాగ్రత్త:
అడవి సఫారీకి వెళ్లేటప్పుడు వేసుకునే దుస్తుల రంగు చాలా ముఖ్యం. ప్రకృతి సహజమైన రంగులైన లేత గోధుమ, ఆకుపచ్చ, బూడిద రంగుల దుస్తులను ఎంచుకోవాలి. తెలుపు, నలుపు, ప్రకాశవంతమైన రంగులు, నియాన్ రంగులను తప్పించుకోవాలి. ఎందుకంటే ఇవి అడవిలో ఉన్న జంతువుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అలాగే శరీరాన్ని పూర్తిగా కప్పే బట్టలు వేసుకోవడం వల్ల కీటకాల నుంచి రక్షణ కలుగుతుంది.
#2
ఫ్లాష్‌లైట్‌లకు గుడ్‌బై చెప్పండి
ఫోటోలు, వీడియోలు తీయాలనిపించడం సహజమే. కానీ మొబైల్ ఫోన్, కెమెరాల్లో ఫ్లాష్‌ను ఉపయోగించకూడదు. ఫ్లాష్ వెలుతురుతో జంతువులు భయపడే లేదా దాడి చేసే అవకాశం ఉంది. అందుకే సహజమైన వెలుతురులోనే చిత్రాలు తీసేందుకు ప్రయత్నించండి. ఇది జంతువులకు, మీ భద్రతకూ మంచిదే.
#3
సన్‌స్క్రీన్ తప్పక ఉపయోగించండి
సఫారీ అనేది ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో జరిగే ప్రయాణం. గంటల తరబడి ఎండలో ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అధిక SPF గల సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా వాడాలి. ముఖం, చేతులు, బట్టలతో కప్పని శరీర భాగాలపై సన్‌స్క్రీన్‌ను సమయానికి అప్లై చేస్తూ ఉండాలి. ఇది చర్మాన్ని UV కిరణాల నుండి రక్షిస్తుంది.
#4
కీటకాల నివారణ కోసం రిపెల్లెంట్ తీసుకెళ్లండి
అడవుల్లో దోమలు, ఈగలు, ఇతర కీటకాలు ఎక్కువగా ఉంటాయి. వీటి కాటు వల్ల చర్మం చికాకుకు గురయ్యే అవకాశముంటుంది. అందుకే మంచి ఇన్‌సెక్ట్ రిపెల్లెంట్‌ను మీ వెంట తీసుకెళ్లడం, దాన్ని వాడడం చాలా అవసరం. ఇది కీటకాల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా, వాటి కాటుకి ఉపశమనం కూడా ఇస్తుంది.
#5
జీప్ లేదా గ్రూప్‌తోనే ఉండండి
సఫారీ గైడ్ ఇచ్చే సూచనలను తప్పక పాటించాలి. వారు చెప్పే వరకు వాహనంలో నుంచి దిగరాదు. అడవిలో జంతువుల ప్రవర్తన గురించి వారికి మంచి అవగాహన ఉంటుంది. వాహనాన్ని వదిలి ఒక్కరే తిరగకూడదు. తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. ఎల్లప్పుడూ మీ గ్రూప్‌తో, జీప్ వాహనంతోనే ఉండాలి.
#6
పిల్లలను నిశ్శబ్దంగా ఉండేలా చేయండి
పిల్లలు సహజంగా ఉత్సాహంగా ఉంటారు. జంతువులను చూడగానే శబ్దం చేసే అవకాశం ఉంటుంది. ఇది జంతువులకు అంతరాయం కలిగిస్తుంది. అందుకే చిన్న పిల్లలను తీసుకెళ్లకపోవడం మంచిది. ఒకవేళ తీసుకెళ్తే, ముందుగా నిశ్శబ్దంగా ఉండాలి, జంతువులకు భయపడేలా ప్రవర్తించరాదు అని వారికి వివరంగా చెప్పాలి. వారు ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
#7
డియో, పెర్ఫ్యూమ్స్‌ను దూరంగా పెట్టండి
బలమైన వాసనలుండే సుగంధద్రవ్యాలు వాడకూడదు. ఈ రకాల వాసనలకు జంతువులు ఆకర్షితులు కావచ్చు లేదా అసహనం వ్యక్తం చేయొచ్చు. ఇది వారి ప్రవర్తనపై ప్రభావం చూపించి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి సుగంధద్రవ్యాల వాడకాన్ని పూర్తిగా నివారించండి.
#8
అవసరమైతే అడవిలోనే బస చేయండి
ఒకే రోజు అన్ని జంతువులను చూడడం సాధ్యం కాకపోవచ్చు. రెండు మూడు రోజుల పాటు పర్యటన ప్లాన్ చేసినట్లయితే, సఫారీ ఏరియాలో లభించే కాటేజీల్లో బస చేయండి. అప్పుడు ఎక్కువ సమయం అడవిలో గడిపే అవకాశం ఉంటుంది. అలాగే జంతువులను వాటి సహజ జీవనశైలిలో చూడొచ్చు. ఇది మీ ప్రయాణాన్ని మరింత ఆనందమయంగా, గుర్తుండిపోయేలా మార్చుతుంది.
ఈ సూచనలు పాటించడం వల్ల మీ అడవి పర్యటన మరింత సురక్షితంగా, ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలతో కలిసి ఈ అనుభవాన్ని మరింత ఉల్లాసభరితంగా అనుభవించవచ్చు!