Largest Airport : మన దేశంలో అతిపెద్ద విమానాశ్రయం ఎక్కడుందో మీకు తెలుసా?
ఎయిర్‌పోర్ట్‌లు విమానాల నిలుపుదల, టర్మినళ్లు, రన్‌వేలు మరియు ప్యాసింజర్ పార్కింగ్ కోసం ఎక్కువ స్థలాన్ని అవసరం పడతాయి. విమానాశ్రయం ఏర్పాటుకు కనీసం కొన్ని వందల ఎకరాలు అవసరం. దేశంలోని ప్రధాన నగరాలలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ప్రతీ రోజు లక్షల మంది విమానయానాన్ని అనుసరిస్తున్నారు. అయితే, మన దేశంలో అతిపెద్ద విమానాశ్రయం ఎక్కడుందో మీకు తెలుసా? విస్తీర్ణ పరంగా దేశంలోనే అతి పెద్ద విమానాశ్రయానికి సంబంధించిన ప్రత్యేకతలను తెలుసుకుందాం.
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ - అతి పెద్దది
దాదాపు 5,500 ఎకరాల విస్తీర్ణంతో శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దేశంలోనే అతి పెద్ద విమానాశ్రయంగా నిలిచింది. GMR గ్రూప్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మరియు తెలంగాణ ప్రభుత్వం కలిసి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP) ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్నారు. విమానాశ్రయం ప్రారంభం నుండి దశలవారీగా ఎదుగుతూ, విమానాశ్రయ నిర్వహణలో ఎన్నో అవార్డులను సాధించింది. ఆధునిక సాంకేతికత, పర్యావరణానుకూల విధానాలను అవలంబిస్తూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ ఇతర ఎయిర్‌పోర్ట్‌లకు ఆదర్శంగా నిలుస్తోంది.
మొదటి మార్పు
డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల కోసం ఇ-బోర్డింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తొలి భారతీయ ఎయిర్‌పోర్ట్‌గా రాజీవ్ గాంధీ విమానాశ్రయం ప్రత్యేకత సాధించింది. ఈ సదుపాయం ద్వారా విమాన బోర్డింగ్ ప్రక్రియలో ప్యాసింజర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా ఫ్లైట్ ఎక్కే సౌకర్యం కలిగింది. అదేవిధంగా, ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా విమానాశ్రయ నిర్వహణ ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి షాపింగ్, డైనింగ్, లాంజ్‌లతో పాటు మెరుగైన ట్రాన్స్‌పోర్ట్ సేవలను అందిస్తోంది. 5,500 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ 12 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది.
ఆర్థిక అభివృద్ధికి ఇంజిన్
రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ ఆధునిక విమానాశ్రయాలలో ఒకటి. హైదరాబాద్ వంటి నగరాలతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఇది ఇంజిన్‌లా పనిచేస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలను అంతర్జాతీయ ప్రయాణాలకు, వ్యాపారవేత్తలు, ఇతర దేశాల పర్యటకులు ఇక్కడికి రావడానికి ఈ ఎయిర్‌పోర్ట్ సహాయపడుతుంది. వ్యూహాత్మకంగా, మన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కీలకమైనది. దేశంలోని ఇతర నగరాలతో పాటు అంతర్జాతీయ నగరాలకు ఇక్కడి నుండి విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అలయన్స్ ఎయిర్, అమెజాన్ ఎయిర్, ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎమైరైట్స్ వంటి అనేక విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి విమానాలను నడుపుతున్నాయి. ఇలా ప్రయాణికుల రద్దీతో ఈ ఎయిర్‌పోర్ట్ కలకలలాడుతోంది.
చెన్నై, కోల్‌కతాను దాటి..
ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఏటా ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. 2023తో పోలిస్తే ఈ సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ 11% పెరిగింది. డొమొస్టిక్ ట్రాఫిక్ 10%, ఇంటర్నేషనల్ ట్రాఫిక్ 14% మేర పెరిగింది. ఈ ఏడాది, జనాభాలో ముందున్న చెన్నై, కోల్‌కతా వంటి మెట్రో నగరాలను కూడా హైదరాబాద్ దాటించింది. అదేవిధంగా, ప్యాసింజర్ల డిమాండ్ మేరకు దేశంలోని పలు నగరాలకు ఇక్కడి నుండి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుండి 6 నగరాలకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభించబడ్డాయి.