 
                                                                                Heart Attack: హార్ట్ ఎటాక్ తొలి హెచ్చరిక ఇదే… నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి కాలంలో గుండెపోటుతో (Heart Attack) మరణాలు భయంకరంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు పెద్దవారికే పరిమితమైన గుండె సమస్యలు ఇప్పుడు చిన్న వయసువారిని కూడా వదలడం లేదు. చాలామంది ఛాతీలో తీవ్ర నొప్పి వచ్చినప్పుడే గుండెపోటు వచ్చిందని అనుకుంటారు. సినిమాల్లో చూపినట్లుగా ఛాతి పట్టుకుని కిందపడిపోవడమే హార్ట్ ఎటాక్ అని భావిస్తారు. కానీ వైద్యుల ప్రకారం, హార్ట్ ఎటాక్ మొదటి హెచ్చరిక అంత స్పష్టంగా ఉండదు. చాలా సాదాసీదాగా కనిపిస్తుంది, అందుకే ఎక్కువ మంది దాన్ని పట్టించుకోరు. ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పిన ముఖ్యాంశాలు ఇవీ..
హెచ్చరిక
అలసట.. తొలి హెచ్చరిక
ఎంత విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గకపోతే, అది గుండెపైన ఒత్తిడి ఉందని సూచించవచ్చు. గుండె బలహీనపడినప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని సరిపడా పంపించలేకపోతుంది. దాంతో అవయవాలకు తగిన ఆక్సిజన్ అందదు, శరీరం అదనంగా పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా ఎప్పుడూ బద్ధకం, బలహీనత, అలసట అనిపిస్తుంది. సరిగ్గా నిద్రపోయినా, తిన్నా, స్ట్రెస్ లేకపోయినా అలసట తగ్గకపోతే.. అది గుండె నుంచి వచ్చే మొదటి SOS సిగ్నల్ కావచ్చు.
లక్షణాలు
ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు
చాలామంది దీన్ని వయసు పెరుగుతున్న లక్షణమని లేదా ఎక్కువ పని చేసిన ఫలితమని అనుకుంటారు. కానీ తగినంత విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గకపోతే, గుండె సమస్య ఉందేమో అని అనుమానం పెట్టుకోవాలి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ లేదా ఆక్సిజన్ కొరత వల్ల శక్తి తగ్గిపోతుంది . ఇది చాలా వ్యాధులలో ఉండే సాధారణ లక్షణం. అందుకే చాలామంది దీన్ని గుండె సమస్యగా గుర్తించలేరు. అయితే అలసటతో పాటు శ్వాస ఇబ్బంది, అజీర్తి, కళ్లు తిరగడం, దవడ నొప్పి వంటి లక్షణాలు ఉంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.
హార్ట్ ఎటాక్
సైలెంట్ హార్ట్ ఎటాక్
గుండె కండరాలకు రక్తప్రసరణ ఆగిపోయినా లేదా తగ్గిపోయినా హార్ట్ ఎటాక్ వస్తుంది. కొన్నిసార్లు ఈ ఎటాక్ తీవ్ర ఛాతీ నొప్పి లేకుండానే వస్తుంది.. దీన్నే "సైలెంట్ హార్ట్ ఎటాక్" అంటారు. స్వల్ప అలసట, వికారం, భుజం లేదా దవడ నొప్పి, ఛాతీలో మంట వంటి సాధారణ లక్షణాలే ఉండవచ్చు. ఇవి సాధారణం అని తీసుకుంటే, గుండెకు తీవ్రమైన నష్టం కలగవచ్చు. డాక్టర్‌ను కలవడంలో ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత ప్రమాదకరం అవుతుంది.
ప్రమాదం
మహిళల్లో ప్రమాదం ఎక్కువ
మహిళలు, పురుషులలో హార్ట్ ఎటాక్ లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. పురుషుల్లో తీవ్రమైన ఛాతీ నొప్పి సాధారణంగా కనిపిస్తుంది. కానీ మహిళల్లో నడుం నొప్పి, వికారం, అలసట, శ్వాస ఇబ్బంది వంటి లక్షణాలే ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా వయసు పైబడిన,మెనోపాజ్ అయిన మహిళల్లో ఈ లక్షణాలు స్వల్పంగా ఉండడం వల్ల అవి నిర్లక్ష్యం చేయబడతాయి. చాలామంది దీన్ని ఎసిడిటీ లేదా ఒత్తిడి అని భావించి ఆలస్యం చేస్తారు. ఈ ఆలస్యం ప్రాణాంతకమవుతుంది.
డాక్టర్
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
అలసట కొన్ని వారాలుగా కొనసాగుతూ, దానికి తోడు శ్వాస ఇబ్బంది, కాళ్ల వాపు, అసమానమైన హార్ట్‌బీట్ ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి. వైద్యులు సూచించిన సమయానికి ECG, ఎకోకార్డియోగ్రామ్, BP చెక్ వంటి టెస్టులు చేయించుకోవడం ద్వారా పెద్ద సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. మన శరీరం పంపించే సంకేతాలను గమనించి సరైన సమయానికి డాక్టర్‌ను సంప్రదిస్తే ప్రాణాపాయం తప్పించుకోవచ్చు.
రిస్క్
లైఫ్‌స్టైల్ మార్పులు - హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించే మార్గం
రోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్మోకింగ్ మానేయాలి, మద్యం దూరం పెట్టాలి, ఒత్తిడిని నియంత్రించుకోవాలి. డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులు ఉంటే అవి నియంత్రణలో ఉంచాలి. తరచూ హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం, డాక్టర్ సలహాలను పాటించడం గుండెను రక్షించే ప్రధాన మార్గాలు. అలసట, బలహీనత, వికారం లాంటి చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఇవే హార్ట్ ఎటాక్ మొదటి హెచ్చరికలు కావచ్చు. గుండె సంకేతాలను గమనించి, సమయానికి వైద్యుడిని సంప్రదించడం జీవితం కాపాడే పెద్ద అడుగు.