PM Modi Health Secret: ప్రధాని ఆరోగ్య రహస్యం ఇదే.. మోదీకి ఇష్టమైన మునగ పరాటాలు ఎలా తయారు చేయాలో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య రహస్యాన్ని స్వయంగా వెల్లడించారు. తాను ప్రతిరోజూ తప్పకుండా మునగకాయలతో తయారు చేసిన పరాటాలను ఆహారంలో భాగంగా తీసుకుంటానని చెప్పారు. మునగలో ఉండే అనేక ఆరోగ్యకర పోషకాలు తన శారీరక దృఢత్వానికి, చురుకుదనానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం పనిచేస్తూ ఉండటం ఆయన ఆరోగ్య స్థాయికి నిదర్శనంగా చెప్పవచ్చు. కేరళీయుల సంప్రదాయ వంటకాలలో ప్రత్యేక స్థానం పొందిన మునగ పరాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి ఎంతో ఇష్టమైన ఈ ప్రత్యేక పరాటాలను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Details
తయారీ విధానం
ముందుగా మునగకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, అర కప్పు నీళ్లు వేసి ప్రెషర్ కుక్కర్‌లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన మునగ ముక్కలను బాగా మాష్ చేసి వడకట్టాలి. ఇందులో గుజ్జు మాత్రమే ఉపయోగించాలి. ఆ మునగ గుజ్జులో అర టేబుల్ స్పూన్ పసుపు పొడి, అర టేబుల్ స్పూన్ ఎర్ర మిరప పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, వాము, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి బాగా కలపాలి. అనంతరం గోధుమ పిండి వేసి గట్టిగా ముద్దలా కలపాలి.
Details
ఇలా చేస్తే రెడీ
ముద్ద కలుపుతున్న సమయంలో అదనంగా నీరు వేయకూడదు. ఈ ముద్దతో పరాటాలను తయారు చేసుకోవాలి. రుచి మరింత పెరగాలంటే పరాటాలు చేస్తూ మధ్యలో కొద్దిగా కొత్తిమీర ఆకులు, నువ్వులు కూడా జోడించవచ్చు. ఈ మునగ పరాటాలను పెరుగుతో కలిసి తింటే మరింత రుచిగా ఉంటాయి. ఆరోగ్యంతో పాటు రుచిని కూడా అందించే ఈ వంటకం ప్రధాని మోడీ రోజువారీ ఆహారంలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది.