Liechtenstein: పేదరికం నుంచి ప్రపంచంలోని ధనిక దేశంగా.. లిక్టెన్‌స్టెయిన్ అద్భుత ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
పేదరికం చీకటినుంచి బయటపడి కోటిశ్వరులుగా ఎదిగిన వ్యక్తుల కథలు మనం తరచూ వింటుంటాం. కానీ ఒకటి కాదు రెండూ కాదు.. మొత్తం దేశం పేదరికంపై గెలిచి, ధనసమృద్ధిగా మారిన కథ వినడం అరుదే. అలాంటి అద్భుత దేశం ఒకటుంది! అక్కడ ఉద్యోగాలే జనాభాకంటే ఎక్కువ; అక్కడి ప్రతి పౌరుడూ కోటీశ్వరుడే. ప్రభుత్వానికి ఒక్క పైసా అప్పూ లేదు. ప్రపంచంలో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఫెయిరీటేల్స్‌లో వర్ణించినట్టుగా, ప్రపంచంలోని అందాన్నంతా పోగేసినట్టుండే ఈ దేశం పేరు లిక్టెన్‌స్టెయిన్. ఇంతటి అద్భుత స్థాయికి ఆ దేశం ఎలా చేరిందో చూద్దాం.
వివరాలు
జనాభా 40వేలు మాత్రమే
ప్రపంచంలో ఉన్న అతి చిన్న దేశాల్లో లిక్టెన్‌స్టెయిన్ ఒకటి. పరిమాణం పరంగా చూస్తే, బెంగళూరు నగరంలో పావువంతు కూడా ఉండదు. మొత్తం జనాభా అంతా కలిపి 40వేలు మాత్రమే. కారులో తిరిగితే నిమిషాల్లో దేశం చుట్టేస్తారు.ఈంత చిన్నదైనా... ఆర్జించిన విజయాలు మాత్రం మహాఅద్భుతమైనవి. ధనిక దేశాల ర్యాంకింగ్లో అమెరికాలాంటి మహాదేశాలతో పోటీ చేస్తూ ఎల్లప్పుడూ టాప్‌లో ఉండేది ఇదే. తలసరి జీడీపీ దగ్గరికి వస్తే..ఇదే రాజు!ఇక్కడి ప్రతి పౌరుడి వార్షిక ఆదాయం సుమారుగా రెండు కోట్లు దాటుతుంది. సేఫ్టీ పరంగా కూడా ఇదే ముందుంది. దేశం మొత్తం కలిపి కేవలం మూడు వందల పోలీసులే ఉన్నప్పటికీ,నేర చరిత్ర ఉన్నవాళ్లు ఏడుగురే! వారిలో కూడా చాలా చిన్న చిన్న కేసులకే 1997లో అరెస్ట్ అయ్యినవాళ్లు.
వివరాలు
సంవత్సరం పొడవునా మంచు
ఇక్కడ నేరాలు దాదాపు జరగవు. అంత నమ్మకం ఉన్నందున ఇళ్లకు తాళాలు కూడా వేయరు. ఇలా అనగానే అతిశయోక్తిగా అనిపించినా... ఈ దేశానికి మిలటరీ కూడా లేదు! ఎందుకంటే ఒక వైపు ఆస్ట్రియా, మరో వైపు స్విట్జర్లాండ్ ఉండటంతో, ఆ రెండు దేశాలతో శాంతియుత సంబంధాలే కాబట్టి లిక్టెన్‌స్టెయిన్‌కు సైన్యం అవసరమే రాలేదు. "సహజ వనరులు బోల్డున్నాయేమో అందుకే ధనిక దేశమై ఉంటుంది" అనుకుంటే... కాదు! మొదటి ప్రపంచ యుద్ధం వరకూ లిక్టెన్‌స్టెయిన్ తీవ్ర పేదరికంలో కూరుకుపోయేంతగా కష్టం చూసింది. సంవత్సరం పొడవునా మంచు ముంచెత్తే వాతావరణం, చుట్టూ గడ్డపరక కూడా మొలవని రాతికొండలే—కాబట్టి వ్యవసాయం కూడా లాభదాయకం కాదు. ఈ ప్రతికూలతలన్నింటినీ దేశం తన తెలివితో అవకాశాలుగా మార్చుకుంది.
వివరాలు
ఆవిష్కరణలతో దూసుకొచ్చింది...
రాచరికం, ప్రజాస్వామ్యం కలగలసిన ఇక్కడి ప్రభుత్వం... రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నూలుపోగు స్థితి నుంచి మెల్లగా ఎదుగుదల మొదలుపెట్టింది. ప్రజల నైపుణ్యాలనే పెట్టుబడిగా తీసుకుని పరిశోధనల్లో, ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెట్టింది. కొన్నేళ్లలోనే కృత్రిమ దంతాల తయారీలో ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించింది. షాన్ నగరం నుంచి 120 దేశాలకు సెరామిక్ క్రౌన్స్, ఫిల్లింగ్ మెటీరియల్ వంటి అనేక దంత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అందుకే దీనిని 'డెంటల్ క్యాపిటల్' అని కూడా పిలుస్తారు. హాలీవుడ్ సెలబ్రిటీలు కోరినట్లుగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన దంతాలు ఇక్కడి కంపెనీలు తయారు చేస్తుంటాయి. ఇదివరుకు ఆప్టికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కూడా స్థిరంగా తయారీ ఉండటంతో—దేశ ఆదాయంలో సగం మాన్యుఫ్యాక్చరింగ్ రంగం నుంచే వస్తోంది.
వివరాలు
రెండో అతిపెద్ద ఆదాయ వనరు ఫైనాన్షియల్ సర్వీసులు
తయారీరంగం తర్వాత రెండో అతిపెద్ద ఆదాయ వనరు ఫైనాన్షియల్ సర్వీసులే. ప్రపంచంలోని అత్యంత ధనిక వ్యక్తులు, సంపన్న దేశాలు వాడే ఫైనాన్షియల్ సేవలలో చాలా లిక్టెన్‌స్టెయిన్ నుంచే అందుతున్నాయి. అంత చిన్న దేశంలో 400 ఎసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, 30 ఇన్షూరెన్స్ కంపెనీలు, 11 బ్యాంకులు, 500 ఐటీ కంపెనీలు ఉండటం నిజంగా ఆశ్చర్యమే. ఇక ప్రత్యేక కరెన్సీ లేకపోవడంతో స్విస్ ఫ్రాంక్‌ను తమ ద్రవ్యంగా ఉపయోగిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ కూడా తమదిగా లేకపోవడంతో—సమీప దేశాల్లో దిగిపోయి అక్కడి నుంచి లిక్టెన్‌స్టెయిన్ చేరుకోవాలి.
వివరాలు
పోస్టల్ స్టాంపుల తయారీ కూడా మంచి ఆదాయ వనరు
ప్రాచీన కోటలు, మంచుతో నిండిన పర్వతాలు, పొడవాటి పైన్ చెట్లు—ఈ దేశం పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. రిసార్టుల్లో సేదతీరడం, మంచులో ఆడుకోవడం కోసం ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. ఒకప్పుడు మొత్తం దేశాన్నే అద్దెకు ఇచ్చే ప్రత్యేక ఆఫర్ కూడా ఇక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇంకా ఓ ఆసక్తికర విషయం—ఇక్కడ పోస్టల్ స్టాంపుల తయారీ కూడా మంచి ఆదాయ వనరు. స్టాంపులు సేకరించే వారికి 24 క్యారెట్ల బంగారంతో చేసిన స్టాంపులు, త్రీడీ డిజైన్లతో స్టాంపులూ విడుదల చేస్తుంది. అంత చిన్న దేశం అయినా... ఒక్క రూపాయి కూడా అప్పుగా లేకుండా ఆర్థికంగా పూర్తిగా స్వావలంబిగా నిలిచి ఉందంటే నమ్మలేనంత గొప్ప విషయమే.