ప్రేరణ: ఒక పనిలో బెస్ట్ అవ్వాలంటే ఆ పనిలోని వరస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి
ఏ పని చేస్తున్నప్పుడైనా ఆ పనిలోని లోపాలు తెలిసినపుడే నువ్వు ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలవు. అలా కాని పక్షంలో ఆ పనిచేయడం నీ వల్ల కాకుండా పోతుంది. ఎందుకంటే అందులోని లోపాలు నువ్వు చేస్తున్న పనికి అడ్డం తగులుతాయి. పనిని పూర్తి చేయకుండా ఆపేస్తాయి. కాబట్టి ఒక పని ఎంచుకున్నప్పుడు ఆ పనిలో ఇబ్బందులు ఎదురైనా కానీ తట్టుకునే శక్తిని సంపాదించుకోవాలి. ఒక లీడర్ అనేవాడు ప్రజల్లోంచి వస్తాడని అంటారు. నీలోని బెస్ట్ అనేది సమస్యలన్నీ నిన్ను చుట్టుముట్టినపుడే వస్తుందని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చేస్తున్న పనిలో కష్టం ఎదురైందని ఆ పనిని అక్కడే వదిలేసావనుకో, ఆరంభ శూరత్వమే అవుతుంది.
పనిలో ఇబ్బందులు రాకపోతే బోర్ కొడుతుంది
ఏ పనైనా ఒకే లెవెల్లో ఎప్పుడూ కొనసాగదు. మధ్య మధ్యలో అనేక ఇబ్బందులు వస్తాయి. వాటన్నింటినీ దాటుకుంటూ వెళ్ళినపుడే మజా వస్తుంది. చేస్తున్న పనిలో ఎలాంటి ఛాలెంజెస్ రాకపోతే ఆ పని బోర్ కొట్టేస్తుంది. పని మధ్యలో వచ్చే ఇబ్బందులనేవి మీ పనిపట్ల మిమ్మల్ని బోర్ కొట్టించకుండా చేసేవని మీరు గుర్తించుకున్నప్పుడు ఆ పనిని మరింత శ్రద్ధగా చేయగలుగుతారు. అలాగే మీలోని బౌండరీస్ ని కూడా దాటి పనిచేసే సత్తా మీకు వస్తుంది. మీలో నైపుణ్యం పెరుగుతుంది. కొత్తగా ఆలోచించడం మొదలెడతారు. ప్రపంచాన్ని కొత్తగా చూడడం మొదలెడతారు. అందుకే ఒక పనిలోని వరస్ట్ ని హ్యాండిల్ చేసే తెలివిని పెంచుకోవాలి. దానికనా ముందు వరస్ట్ గురించి భయపడకూడదన్న సంగతి గుర్తుంచుకోవాలి.