
Toli Ekadasi 2025: నేడు పవిత్ర తొలి ఏకాదశి.. పూజా ముహూర్తం, విధానం తెలుసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
ఏడాది మొత్తం 24 ఏకాదశులు ఉండగా, ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని ప్రత్యేకంగా 'తొలి ఏకాదశి'గా పిలుస్తారు. దీనిని 'శయన ఏకాదశి' అని కూడా గుర్తిస్తారు. ఈ రోజునుంచి నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై శయనిస్తారని విశ్వాసం. ఈ నాలుగు నెలల కాలాన్ని 'చాతుర్మాసం'గా పిలుస్తారు. హిందూ ధర్మంలో ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని పూజిస్తూ మోక్షాన్ని కోరుకుంటారు. పురాణాల ప్రకారం, ఇది శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి. దీనితో పాటు హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని పండుగల శుభారంభం కూడా ఈ రోజు నుంచే జరుగుతుంది.
Details
పూజకు శుభ సమయం
హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి తిథి జూలై 5 సాయంత్రం 6:58 గంటలకు ప్రారంభమై జూలై 6 రాత్రి 9:14 గంటలకు ముగుస్తుంది. పూజకు శుభ సమయం జూలై 6 ఉదయం 5:00 గంటల నుంచి 9:00 గంటల వరకు ఉంది. ఈ రోజుతో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పూజా విధానం ఈ రోజు తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రధారణ చేయడం మంగళకరంగా భావించబడుతుంది. పూజా మందిరాన్ని శుద్ధి చేసి, లక్ష్మీ నారాయణుల చిత్రాన్ని శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమతో అలంకరించాలి. వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులను వేరుగా వేసి దీపారాధన చేయాలి.
Details
మంత్రోచ్చారణ
పూజలో తులసి, చామంతి వంటి పసుపు పువ్వులతో పాటు తెల్ల గన్నేరు, నందివర్ధనం, తుమ్మి, జాజీ పుష్పాలను సమర్పించాలి. ఓం నమోః నారాయణాయ ఓం నమోః భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలను జపిస్తూ భక్తిశ్రద్ధలతో పూజ నిర్వహించాలి. అనంతరం పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించాలి. పూజకు ముందు 'ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తితో పాటించి ఉపవాసంగా ఆచరిస్తానని శ్రీమహావిష్ణువు సమక్షంలో సంకల్పం చేయాలి. పురాణాల ప్రకారం, తొలి ఏకాదశి రోజున ఈ విధంగా విష్ణుమూర్తిని పూజించటం వలన అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయని, జీవితంలో సుఖశాంతులు, సంపదలు, మోక్షమార్గం లభిస్తాయని చెప్పారు.