ట్రావెల్: దివ్యాంగులకు సౌకర్యంగా ఉండే ఇండియాలోని పర్యాటక ప్రదేశాలు
దివ్యాంగులకు సౌకర్యంగా ఉండే పర్యాటక ప్రాంతాలు ఇండియాలో చాలానే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో దివ్యాంగులు స్వేఛ్ఛగా తిరగవచ్చు. ఒకచోటి నుండి మరోచోటికి సులభంగా వెళ్ళవచ్చు. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏంటో చూద్దాం. కోచి: 2016లో దివ్యాంగులకు సౌకర్యాలు అమర్చిన మొట్టమొదటి పర్యాటక ప్రాంతంగా కోచి నిలుస్తుంది. పర్యాటక ప్రాంతాల్లో పెద్దలకు ఇబ్బంది కలగకుండా, దివ్యాంగులకు సౌకర్యంగా ఉండేందుకు ర్యాంప్స్, అడుగువేస్తే జారేలా చేయని టైల్స్ తో నిర్మాణాలను చేపట్టింది. అలాగే వినికిడి సమస్యలు, కంటిచూపు సమస్యలు ఉన్నవారికి కావాల్సిన వస్తువులను పర్యాటక ప్రాంతాల్లో ఉందుతోంది. హోటల్స్ లో దివ్యాంగుల కోసం ప్రత్యేక రెస్ట్ రూమ్స్, సెల్ఫ్ ఆపరేటెడ్ ర్యాంప్స్ ఏర్పాటు చేసింది కేరళ టూరిజం.
ప్రదక్షిణల కోసం వీల్ ఛెయిర్స్
ఢిల్లీ: ఢిల్లీలోని మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్లలో వీల్ ఛెయిర్స్ అందుబాటులో ఉంటాయి. ఎర్రకోట సందర్శనకు వెళ్తే ప్రత్యేక ర్యాంప్ ఉంటుంది. జనపథ్, అక్షరధామ్ టెంపుల్ దగ్గర కూడా వీల్ ఛెయిర్స్ ఉంటాయి. పూరీ: శుభ్రత విషయంలో, దివ్యాంగులకు సరైన సౌకర్యాలు కల్పించే విషయంలో ఒడిషాలోని పూరీ తీరానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చింది. పూరీ జగన్నాథ్ గుడిలో ప్రదక్షిణలు చేయాలంటే దివ్యాంగులకు వీల్ ఛెయిర్స్ ఉంటాయి. ఆగ్రా: తాజ్ మహల్, ఆగ్రా కోట సందర్శన కోసం దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. ఫతేపూర్ సిక్రీ స్మారక చిహ్నం ఉన్న ప్రాంతంలో దివ్యాంగుల కోసం రెస్ట్ రూమ్స్, ప్రత్యేక టికెట్ కౌంటర్స్ ఉంటాయి.