ట్రావెల్: విశాఖపట్నం వెళ్తున్నారా? ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం మర్చిపోకండి
విశాఖపట్నం అనగానే అందరికీ ఆర్కే బీచ్ గుర్తొస్తుంది. ఆర్కే బీచ్ మాత్రమే కాకుండా విశాఖపట్నంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కైలాసగిరి వద్ద సూర్యాస్తమయం చూడడం, ఐఎన్ఎస్ కురుసుర మ్యూజియం, యారాడ బీచ్ ఇంకా చాలా సందర్శన ప్రదేశాలు ఉన్నాయి. విశాఖపట్నం పర్యటనకు వెళ్ళిన వాళ్ళు అక్కడి నుండి కొన్ని వస్తువులను గుర్తుగా ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరకు చాక్లెట్స్: అరకు లోయ ప్రాంతంలో తయారయ్యే ఈ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. పీనట్ బట్టర్, కాఫీ బిస్కెట్ వంటి ఫ్లేవర్లతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. మీరు విశాఖపట్నం వెళ్తే ఈ చాక్లెట్స్ ఖచ్చితంగా టెస్ట్ చేయండి.
భౌగోళిక గుర్తింపు పొందిన బొమ్మలు
ఏటికొప్పాక కొయ్య బొమ్మలు: విశాఖపట్నం నుండి 67కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటికొప్పాక గ్రామంలో ఈ బొమ్మలను తయారు చేస్తారు. చూడడానికి చాలా అందంగా ఉండే ఈ బొమ్మలు మిమ్మల్ని అబ్బుర పరుస్తాయి. ఏటికొప్పాక బొమ్మలకు 2017లో జియోగ్రఫికల్ ఇండికేషన్ (భౌగోళిక గుర్తింపు) ట్యాగ్ వచ్చింది. మాడుగుల హల్వా: 1890లో మాడుగుల గ్రామానికి చెందిన దాగేటి ధర్మారావు తయారుచేసిన ఈ హల్వా రెసిపీ ఇప్పటికీ చాలా ఫేమస్. మాడుగుల గ్రామంలో ఈ హల్వా ఎక్కువగా దొరుకుతుంది. విశాఖపట్నంలోనూ ఈ హల్వా మీరు కొనవచ్చు. వెదురు బుట్టలు: చాలా చక్కని డిజైన్ తో అందంగా ఉండే వెదురు బుట్టలు విశాఖపట్నంలోని కుమ్మరి వీధి, పూర్ణ మార్కెట్ ప్రాంతాల్లో లభిస్తాయి.