LOADING...
ICC Mens T20 World Cup: క్రీడల్లో రాజకీయాలు వద్దు.. భారత్‌తో మ్యాచ్‌కు నో చెప్పిన పాక్‌ ప్రధాని షెహబాజ్
క్రీడల్లో రాజకీయాలు వద్దు.. భారత్‌తో మ్యాచ్‌కు నో చెప్పిన పాక్‌ ప్రధాని షెహబాజ్

ICC Mens T20 World Cup: క్రీడల్లో రాజకీయాలు వద్దు.. భారత్‌తో మ్యాచ్‌కు నో చెప్పిన పాక్‌ ప్రధాని షెహబాజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌తో తలపడబోమన్న తమ నిర్ణయాన్ని పాకిస్థాన్‌ మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్వయంగా ధ్రువీకరించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడకూడదన్న నిర్ణయంపై తమ ప్రభుత్వం పూర్తిగా స్పష్టతతో ఉందన్నారు. క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. ఈ విషయంలో సరైన నిర్ణయమే తీసుకున్నామని షెహబాజ్‌ వ్యాఖ్యానించారు. అయితే భారత్‌తో ఆడకపోవడానికి గల అసలు కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

వివరాలు 

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీపై ఒత్తిడి

పాకిస్థాన్‌ వైఖరిపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ అభిప్రాయపడింది.టోర్నీలో ఎంపిక చేసిన మ్యాచ్‌లనే ఆడతామనడం సరికాదని స్పష్టం చేసింది. అయినా పాక్‌ తన పెంకితనం వీడటం లేదు. పొట్టి ప్రపంచకప్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌,పాకిస్థాన్‌ జట్లు తలపడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, భద్రతా కారణాలను చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలంటూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీపై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే భారత్‌లో భద్రతా పరిస్థితులు పూర్తిగా అనుకూలంగానే ఉన్నాయని ఐసీసీ తేల్చింది. అందువల్ల మ్యాచ్‌ల మార్పుకు అంగీకరించలేదు.దీనితో బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ నుంచి వైదొలిగింది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశం కల్పించింది.

వివరాలు 

పాక్‌పై ఐసీసీ ఆంక్షలు విధించే అవకాశం 

బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్‌.. భారత్‌తో మ్యాచ్‌ను ఆడబోమంటూ పొట్టి ప్రపంచకప్‌లోనూ అదే వైఖరిని కొనసాగిస్తోంది. పాక్‌ నిజంగానే మ్యాచ్‌కు దూరంగా ఉంటే, ఆ దేశంపై ఐసీసీ కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్‌ ఆర్థికంగా కూడా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.

Advertisement