Sansad TV: అన్ని ప్రాంతీయ భాషల్లో సంసద్ టీవీ ప్రసారాలు
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో లోక్‌సభ సచివాలయం కీలక నిర్ణయం తీసుకుంది. సంసద్ టీవీ ప్రసారాలను ఇకపై తెలుగుతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏర్పాటుతో పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు చేసే ప్రసంగాలను ఈ టీవీ ప్రసారాల ద్వారా ఆయా ప్రాంతీయ భాషల్లోకి ఏకకాలంలో అనువాదం చేస్తారు. సభల్లో జరుగుతున్న చర్చలు, సభ్యుల ప్రసంగాలు ఇక అన్ని ప్రాంతీయ భాషల్లో వినిపించనున్నాయి.
వివరాలు
22 భారతీయ భాషల్లో ఏ భాషలోనైనా సభ్యులు మాట్లాడేందుకు అనుమతి
దీని ద్వారా ప్రజలు తమ మాతృభాషలోనే పార్లమెంట్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించి, వినే అవకాశం లభించనుంది. ప్రస్తుతం రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పొందుపరిచిన 22 భారతీయ భాషల్లో ఏ భాషలోనైనా సభ్యులు మాట్లాడేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. ఇప్పటివరకు అటువంటి ప్రసంగాలను ఇతర సభ్యులు అర్థం చేసుకునేలా హిందీ, ఇంగ్లిష్‌లోకి మాత్రమే అనువదిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ అనువాద సేవలను అన్ని ప్రాంతీయ భాషలకు కూడా విస్తరించినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. సంసద్ టీవీ ప్రసారాలను యూట్యూబ్ లింక్ ద్వారా కూడా వీక్షించవచ్చని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.