
Vinayaka Chavithi 2025: గణేశుని పూజలో తులసి నిషేధం.. ఎందుకు వాడరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
గణేశుని పూజలో తులసి ఆకులను సమర్పించడం నిషేధమని హిందూ సంప్రదాయంలో స్పష్టమైన నియమం ఉంది. ఈనిషేధం వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక గాథ దాగి ఉంది. దీనిని పూర్ణియాకు చెందిన పండితుడు మనోత్పల్ ఝా వివరించారు. హిందూ ధర్మంలో గణేశ చతుర్థి అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. వినాయకుని జన్మదినోత్సవంగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా భక్తులు గణపతికి మోదకాలు, గరిక గడ్డి(దూర్వా), పిండివంటలు, పుష్పాలు సమర్పిస్తారు. తులసి ఆకులు మాత్రం గణేశ పూజలో వాడరాదు. పౌరాణిక గాథ ప్రకారం ఒకసారి ధర్మాత్మజుని కుమార్తె తులసి తీర్థయాత్రకు బయలుదేరింది. తన యాత్రలో గంగానది తీరంలో గణేశుడు లోతైన ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన మహిమాన్వితమైన రూపాన్నిచూసి తులసి ఆకర్షితమై, ఆయనను వివాహం చేసుకోవాలని కోరింది.
Details
ఆగస్టు 27న పండగ
గణేశుడు ధ్యానాన్ని విరమించి, ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు.దీనితో ఆగ్రహించిన తులసి, గణేశునిపై శాపమిచ్చింది. 'నీ వివాహం ఎప్పటికీ జరగకూడదు'. దానికి ప్రతిగా గణేశుడు కూడా తులసిని శపించాడు 'నీవు ఒక మొక్కగా మారిపోతావు. భక్తులు విష్ణువు పూజలో నీకు ప్రాధాన్యం ఇస్తారు కానీ నా పూజలో మాత్రం నీకు స్థానం ఉండదు'. ఈ గాథ కారణంగానే గణేశుని పూజలో తులసి ఆకులు నిషేధంగా మారాయి. బదులుగా గణపతి పూజలో దూర్వా గడ్డి, మోదకాలు, ఎరుపు పువ్వులు, సింధూరం సమర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఆచారం గణేశ భక్తులలో అత్యంత ముఖ్యమైన నియమంగా స్థిరపడింది. ఈఏడాది గణేశ చతుర్థి 2025 ఆగస్టు 27న ప్రారంభమై, సెప్టెంబరు 6న అనంత చతుర్దశి నాడు విసర్జనతో ముగియనుంది.