UAE: ఉద్యోగులకు కంపెనీ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కొందరికి ఐఫోన్, మరికొందరికి చాక్లెట్లు!
ఈ వార్తాకథనం ఏంటి
యూఏఈకి చెందిన ఓ మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ తన ఉద్యోగులకు వినూత్నంగా సర్‌ప్రైజ్ ఇచ్చింది. సంస్థ అభివృద్ధికి కీలకంగా పనిచేసిన ఉద్యోగుల కోసం 'వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్' (World Star Manpower) ప్రత్యేక గిఫ్ట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా పలు గిఫ్ట్ ప్యాకెట్లను సిద్ధం చేసి.. ఉద్యోగులు తమకు నచ్చిన ప్యాక్‌ను ఎంచుకునే అవకాశం కల్పించింది. ఒక్కో బాక్స్‌లో ఒక్కో గిఫ్ట్.. ఉద్యోగులు వరుసగా ఉంచిన గిఫ్ట్ ప్యాకెట్లలో తమకు నచ్చిన వాటిని ఎంచుకున్నారు. ఓ ఉద్యోగి తనకు నచ్చిన ప్యాక్‌ను తెరవగా.. అందులో ఐఫోన్ కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. మరో ఉద్యోగి ఎంచుకున్న బాక్స్‌లో మాత్రం చాక్లెట్ ఉండటంతో పరిస్థితి భిన్నంగా మారింది.
వివరాలు
చాక్లెట్లు వచ్చిన వారికి కూడా ఐఫోన్లే..
ఇలా కొందరికి ఐఫోన్లు దక్కగా.. మరికొందరి గిఫ్ట్ ప్యాకెట్లలో చాక్లెట్లు వచ్చాయి.
తమకు వచ్చిన గిఫ్ట్‌లను చూసి ఉద్యోగులు సందడి చేశారు. అయితే చివర్లో కంపెనీ మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది.
మొదట చాక్లెట్లు మాత్రమే లభించిన ఉద్యోగులకు కూడా ఐఫోన్లను అందించింది. దీంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడంతో పాటు సంస్థ పట్ల వారి అంకితభావాన్ని గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది.
వివరాలు
సోషల్ మీడియాలో వీడియో..
ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కంపెనీ వ్యవస్థాపకుడు నిషాద్ హుస్సేన్, ఆయన భార్య, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వీడియోలో ఉద్యోగులు గిఫ్ట్ ప్యాకెట్లను ఎంచుకోవడం, వాటిని తెరిచి చూసి ఆశ్చర్యపోవడం వంటి దృశ్యాలు కనిపించాయి.
'ప్రతి ప్రయత్నం.. ప్రతి ఆలోచన కీలకమే'
ఉద్యోగుల కృషిపై హసీనా నిషాద్ స్పందిస్తూ.. సంస్థ నిజమైన విజయానికి ఉద్యోగుల అంకితభావం, సానుకూల దృక్పథం, సమష్టి కృషే ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఉద్యోగి చేసే ప్రయత్నం, అందించే ఆలోచన, చేసే సహకారం కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
అందుకే ఉద్యోగుల కృషికి గుర్తింపుగా తమ తరఫున ఈ చిన్న కానుకను అందించినట్లు ఆమె వెల్లడించారు.