LOADING...
Vande Mataram: 150 ఏళ్లు పూర్తి చేసుకున్న 'వందేమాతరం'.. బ్రిటిష్‌ దమనానికి ప్రతిస్పందనగా పుట్టిన జాతి నినాదం! 
150 ఏళ్లు పూర్తి చేసుకున్న 'వందేమాతరం'.. బ్రిటిష్‌ దమనానికి ప్రతిస్పందనగా పుట్టిన జాతి నినాదం!

Vande Mataram: 150 ఏళ్లు పూర్తి చేసుకున్న 'వందేమాతరం'.. బ్రిటిష్‌ దమనానికి ప్రతిస్పందనగా పుట్టిన జాతి నినాదం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

వందేమాతర గీతం — భారత ఆత్మను ప్రతిబింబించిన ఆ నినాదం. ఆ గేయం. 'అమ్మ' అన్న పిలుపులోని ఆప్యాయత, ప్రేమ, భక్తి కలగలసిన ఈ సంక్షిప్త కావ్యం కేవలం ఒక పాట కాదు — అది ఒక జాతిని మేల్కొలిపిన శక్తి. ఆధ్యాత్మికవేత్తలు దీన్ని 'సాక్షాత్తు ఋషి వాక్కు'గా విశ్లేషిస్తే, ఉద్యమకారులు దీన్ని "పోరాట స్ఫూర్తి కేంద్రం"గా పరిగణించారు. దేశమాతకు అంకితమైన ఆ సమర నినాదానికి నేటికి 150 ఏళ్లు పూర్తయ్యాయి.

Details

అవమానంతో మొదలైన ఆవేశం

బెంగాల్‌లో డిప్యూటీ మేజిస్ట్రేట్‌గా ఉన్న బంకిమ్‌చంద్ర ఛటోపాధ్యాయ జీవితంలో ఒక సంఘటనే ఆ గీతానికి పునాదిగా నిలిచింది. ఒకరోజు రథంలో ప్రయాణిస్తుండగా ఓ బ్రిటిష్ లెఫ్టినెంట్ కల్నల్‌ డఫిన్‌ అతనిని అవమానించాడు. బంకిమ్‌చంద్రపై చేయి చేసుకున్న ఆ తెల్లదొరపై ఆయన క్రిమినల్‌ కేసు వేశారు. విచారణ సమయంలో జడ్జి సర్దిచెప్పడానికి ప్రయత్నించినా, బంకిమ్‌చంద్ర తన గౌరవం మీద రాజీ పడలేదు. చివరికి డఫిన్‌ కోర్టులో బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయినా బంకిమ్‌చంద్ర మనసులోని అవమానాగ్ని ఆరలేదు. "నన్నే ఇలా అవమానిస్తే సామాన్యుడి పరిస్థితి ఏమవుతుందీ?" అని కలత చెంది, కొద్ది రోజుల సెలవు తీసుకుని కోల్‌కతాకు బయలుదేరాడు.

Details

కలం నుంచి వచ్చిన పదాలివే

అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తమ ప్రార్థనగీతం 'గాడ్ సేవ్ ద కింగ్'ను భారత జాతీయ గీతంగా ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నదనే వార్త వినగానే ఆయన ఆగ్రహంతో తట్టుకోలేకపోయాడు. ఆ ఆవేశమే ఆయన కలం నుంచి అమరమైన పదాలుగా జాలువారింది > వందేమాతరం > సుజలాం సుఫలాం మలయజశీతలాం... > సస్యశ్యామలాం మాతరం... ఈ రెండు పాదాలే ఆయన 1875 నవంబర్ 7న రాసిన మొదటి రూపం.

Details

విమర్శల నడుమ నిలిచిన గేయం

బెంగాల్‌లో అప్పటికే ఆధునిక సాహితీ సమ్రాట్టుగా పేరు తెచ్చుకున్న బంకిమ్‌చంద్ర 'దుర్గేశనందిని', 'అనుశీలన మిత్ర' వంటి నవలలతో కీర్తి గడించాడు. కానీ 'వందేమాతరం' పండితులకు పెద్దగా నచ్చలేదు. సంస్కృతం, బెంగాలీ భాషల కలగాపులగం కారణంగా విమర్శలు వెల్లువెత్తాయి. మీకు నచ్చకపోతే విసిరి పారేయండి అంటూ ఆయన నిర్లిప్తంగా స్పందించాడు. తన జీవితకాలంలో ఈ పాట ప్రజల్లోకి పెద్దగా చేరలేదు. తర్వాత ఆయన 'ఆనందమఠ్‌' నవలలో దాన్ని ప్రార్థనగీతంగా చేర్చాడు.

Details

 ఠాగూర్‌ చేతిలో మంత్రగీతం

మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌ ఆ గేయంలోని గాఢతను గుర్తించాడు. 1886లో కలకత్తా కాంగ్రెస్‌ సమావేశంలో తానే స్వయంగా దానికి బాణీ కట్టి ఆలపించాడు. బంకిమ్‌ మరణానంతరం (1895) ఈ గేయం ఆవశ్యకతను దేశం అర్థం చేసుకుంది. 1905లో బెంగాల్ విభజన సమయంలో ఇది స్వదేశీ ఉద్యమానికి చిహ్నంగా మారింది. ఠాగూర్‌ నేతృత్వంలో ప్రజలు రాఖీ కట్టుకుంటూ హిందూ-ముస్లిం ఐక్యతకు సంకేతంగా "వందేమాతరం" నినాదాలు చేశారు.

Details

విప్లవ స్ఫూర్తి గీతం

వందేమాతరం విప్లవ సాహిత్యానికి మూలంగా మారింది. బెంగాల్‌ విప్లవకారులు ఈ గేయాన్ని దేశమంతా వ్యాప్తి చేశారు. అరవింద్‌ ఘోష్‌ మొదటిసారిగా దీనిని ఇంగ్లీష్‌లోకి అనువదించాడు. 1906లో పాథేఫోన్స్ కంపెనీ గ్రామఫోన్ రికార్డుగా విడుదల చేసింది. బ్రిటిష్ పాలకులు దీని తీవ్రత గ్రహించి నిషేధం విధించారు.ఆ నిర్ణయం భారతీయులలో తిరుగుబాటు జ్వాలలను రగిలించింది. ఆంధ్రభూమిపై 'వందేమాతరం' ప్రతిధ్వని 1907లో రాజమహేంద్రవరం విద్యార్థులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు నేతృత్వంలో మొదటిసారిగా వందేమాతరాన్ని ఊరేగింపుగా పాడారు. ప్రిన్సిపల్ హంటర్ ఆయనను కాలేజీ నుంచి బహిష్కరించగా విద్యార్థుల్లో ఆగ్రహం రేగింది. గ్రామాల్లో వందేమాతరం సంఘాలు ఏర్పడ్డాయి.ఆ సమయంలో చిన్నపరెడ్డి అనే రైతు ఇంగ్లిషు అధికారిపై తిరుగుబాటు చేయడం, ఉరిశిక్షకు గురవడం—ఈ గేయం ప్రభావం ఎంత లోతుగా ఉందో చూపించింది.

Details

వీరుల ప్రాణనాదం

1908లో ఉరిశిక్షకు గురైన కుదిరామ్ బోస్ చివరి నిమిషంలో "వందేమాతరం" అంటూ చిరునవ్వుతో ఉరికొయ్య వైపు నడిచాడు. అదే గీతం బుధు నోనియా అనే బాలుడి పెదవులపై కూడా వినిపించింది. అతను ఉప్పు కొలిమిలో కాలిపోయే వరకు ఆ నినాదమే చేశాడు. మాతంగి హజ్రా కాల్పుల మధ్య ప్రాణాలు విడిచే క్షణంలో కూడా అదే నినాదం పలికింది. తెలంగాణలోనూ 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందేమాతరాన్ని పాడడంతో ఉద్యమం మొదలైంది. నిజాం పాలన వణికిపోయింది. బహిష్కరణలు, నిరసనలు కొనసాగాయి. ఆ విద్యార్థుల్లో తరువాత భారత ప్రధాని అయిన పీవీ నరసింహరావు కూడా ఉన్నారు.

Details

విభజన విత్తనాలు

1920 వరకూ వందేమాతరం అన్ని మతాలవారి గీతం. కానీ బ్రిటిషువారు మతభేదాలు రేపి దీనిని హిందువుల ప్రార్థనా గీతమని దుష్ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ 1937లో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి నెహ్రూ, ఠాగూర్‌ల సలహా తీసుకుంది. ఠాగూర్‌ తొలి రెండు పాదాలు ఎటువంటి మతవ్యతిరేకతలతో లేవని తెలిపినా పార్టీ వెనుకడుగు వేసింది. దీనితో సుభాష్ చంద్రబోస్ అసంతృప్తి చెందగా, గాంధీ దీన్ని "మన హృదయాల గీతం"గా అభివర్ణించారు. స్వాతంత్య్ర ఉద్యమం 1947 ఆగస్టు 15న భారత స్వాతంత్య్రం సాధించిన ఉదయం, ఆకాశవాణిలో మొదటగా వినిపించిన గీతం వందేమాతరం. రాజ్యాంగ పరిషత్తు 1950లో దీనికి "జనగణమన"తో సమాన హోదా కల్పించింది.

Details

అపురూప గౌరవం

1947లో పార్లమెంట్‌లో ఓమ్‌ప్రకాశ్‌ వందేమాతరాన్ని అచ్చమైన గాత్రంతో ఆలపించాడు. దూరదర్శన్‌లో సుప్రభాత గీతంగా ఇప్పటికీ నేపథ్య సంగీతం లేకుండా వినిపిస్తుంది. బీబీసీ పోల్‌లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గీతాల్లో రెండో స్థానంలో నిలిచింది. 1906లో ఠాగూర్‌ గళంలో రికార్డైన ఒరిజినల్‌ కాపీని 1966లో ఇందిరాగాంధీ భారతానికి తెప్పించారు. శాశ్వత నినాదం అసతోమా సద్గమయ, సత్యమేవ జయతే, జననీ జన్మభూమిశ్చ, మా ఫలేషు కదాచన — ఇవన్నీ మానవ వికాసాన్ని సూచించే వాక్యాలు. వాటిలాగే 'వందేమాతరం' కూడా ఒక ఆత్మనినాదం, ఒక శాశ్వత జాతీయ గీతం — భారత గుండెల్లో ఎప్పటికీ మార్మోగిపోతూనే ఉంటుంది.