Vinayaka Chavithi: జయజయ శుభకర వినాయక.. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
భారతీయులకు అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. లయకారుడు పరమేశ్వరుడు, పార్వతిల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. వినాయకుడు.. విఘ్నాధిపతి.. గణనాథుడు.. బొజ్జ గణపయ్య.. ఏకదంతుడు.. లంబోధరుడు ఇలా ఏ పేరుతో స్వామిని కొలిచినా సకల విఘ్నాలు తొలగి విజయం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఏ కార్యక్రమం చేపట్టినా తొలుత పూజించేది గణపతినే. వినాయక చవితి పండగ వచ్చిదంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి మొదలవుతుంది.
చిత్రాలు
ప్రతి గల్లీలోని ఒక విఘ్నేశ్వరుడు వెలుస్తాడు. గణనాథుడిని ప్రతిష్టించడం దగ్గర నుంచి నిమజ్జనం చేసేంత వరకు చిన్నా పెద్దా చాలా బిజీ అయిపోతారు. ఇక తెలుగు సినిమాల్లోనూ వినాయకుడికి ప్రత్యేక స్థానముంది. సినిమా ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టింది మొదలు.. గుమ్మడికాయ కొట్టే వరకూ ఎలాంటి విఘ్నాలు లేకుండా అంతా సజావుగా సాగాలని విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. వినాయకుడి నేపథ్యంలో టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చి, విజయాలు సాధించాయి. మరి ఆ చిత్రాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వినాయక చవితి
వినాయక చవితి రోజున వినాయక వ్రత కథ చదువుకుని, పూజ చేసుకోవడం ఆనవాయితీ. ఈ కథ ఆధారంగా సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించిన చిత్రం 'వినాయక చవితి'. ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల ఇందులో నటించారు. కె. గోపాలరావు నిర్మించిన ఈ సినిమా 1957 ఆగస్టు 22న విడుదలైంది. వినాయక చవితి రోజున శ్రీకృష్ణుడు పాలలో చంద్రుని చూడటంవల్ల సత్రాజిత్తు సంపాదించిన శమంతకమణిని అపహరించాడన్న అపఖ్యాతి మూటగట్టుకుంటాడు. ఆ తర్వాత వినాయక వ్రతం ఆచరించి, నిర్దోషిగా తనను తాను నిరూపించుకుని బయటపడతాడు. అందరూ చవితి నాడు వినాయక వ్రతం ఆచరిస్తే, ఎలాంటి నిందలు లేకుండా ఉంటారనే కథతో 'వినాయక చవితి' చిత్రాన్ని తెరకెక్కించారు.
భూ కైలాస్
లయకారుడు శివుడి భక్తుడు రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు. ఆత్మలింగం సాధించి అమరత్వం పొందాలన్నది రావణాసురుడి కోరిక. ఆయన తపస్సును మెచ్చుకున్న శివుడు ఆత్మలింగం ఇస్తాడు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని షరతు విధిస్తాడు. ఇక రావణాసురుడు సంధ్య వందనం చేసే సమయంలో శివుడి ఆత్మలింగం రావణుడి పాలు కాకుండా చేస్తాడు వినాయకుడు. ఎన్టీఆర్ రావణునిగా, ఏఎన్నార్ నారదుడిగా నటించిన ' భూ కైలాస్' చిత్రకథ ఇది. కె. శంకర్ దర్శకత్వంలో ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ సినిమా 1958 మార్చి 20న రిలీజైంది.
శ్రీ వినాయక విజయం
వినాయకుడి జీవిత చరిత్రపై తెలుగులో పూర్తి స్థాయిలో వచ్చిన చిత్రం 'శ్రీ వినాయక విజయం'. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, వాణిశ్రీ శివ పార్వతులుగా నటించారు. శివదీక్షా వ్రతాన్ని ఆచరించడానికి పూనుకుని స్నానమాచరించబోతూ పిండితో ఒక బాలుని బొమ్మ తయారు చేసి, దానికి ప్రాణం పోసి, కాపలాగా ఉంచుతుంది పార్వతీదేవి. అదే సమయంలో అక్కడికి వచ్చిన శివుణ్ణి లోనికి అనుమతించడు ఆ బాలుడు. శివుడు ఆగ్రహించి బాలుని శిరస్సు ఖండిస్తాడు. దీంతో పార్వతి తన బిడ్డను ఎలాగైనా బతికించమని శివుణ్ణి కోరుతుంది. ఆ బాలునికి ఏనుగు తలను అమర్చి శివుడు ప్రాణం పోస్తాడు. 1979 డిసెంబరు 22న ఈ చిత్రం విడుదలైంది.
పాటలన్నీ హిట్టే
ఇక పాటల విషయానికొస్తే.. తెలుగు సినిమాల్లో లంబోదరుడిని కీర్తిస్తూ ఎన్నో పాటలు వచ్చాయి. ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగా తెరకెక్కిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలో 'దేవుడు చేసిన మనుషుల్లారా..' అనే పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలో సాగుతుంది. వెంకటేష్ నటించిన 'కూలీ నెంబర్ 1' సినిమాలోని 'దండాలయ్యా ఉండ్రాలయ్యా..' పాట ఇప్పటికీ ప్రతి వినాయక మండపంలో వినిపిస్తూ ఉంటుంది. అలాగే దేవుళ్లు చిత్రంలోని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంపై 'జయజయ శుభకర వినాయక.. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక' అంటూ సిద్ధి వినాయకుడి వైభవం గురించి చెప్పే పాట ఓ ఆణిముత్యం. చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'జై చిరంజీవ' సినిమాలో 'జై జై గణేశా.. జై కొడత గణేశా..' పాట సూపర్‌హిట్‌గా నిలిచింది.