వినాయక చవితి: పర్యావరణం సురక్షితంగా ఉండేలా గణపతి డెకరేషన్ ఇలా చేయండి
వినాయక చవితి వచ్చేస్తోంది. దేశంలోని గణేష్ మండపాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇండ్లను శుభ్రం చేస్తూ, గణపతిని పూజించడానికి భక్తులు సిద్ధమవుతున్నారు. వినాయక చవితి పండగ చేసుకునే ప్రతీ ఒక్కరూ పర్యావరణం గురించి ఆలోచించాలి. ఈ మధ్య కాలంలో పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచే దిశగా వినాయక చవితి సెలెబ్రేషన్స్ చేసేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. మట్టి గణపతి తయారు చేయడం, గణపతి అలంకరణలో పర్యావరణ సంరక్షణ వస్తువులు వాడటం చేస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణాన్ని సంరక్షించేలా గణపతి అలంకరణ ఎలా చేయాలో తెలుసుకుందాం.
ప్లాస్టిక్ వాడకండి
డెకరేషన్ చేసేటపుడు ప్లాస్టిక్ వస్తువులు వాడకండి. మళ్ళీ మళ్లీ వాడగలిగే వస్త్రాలు వాడండి. చిన్న పూలకుండీలు, కొబ్బరి పెంకులతో వివిధ రకాల అలంకరణ వస్తువులు తయారు చేయడం బాగుంటుంది. పేపర్, బట్టలతో మంచి మంచి డెకరేషన్స్ చేయవచ్చు. కావాలంటే ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తే వందల కొద్దీ వీడియోలు వచ్చి పడుతుంటాయి. లైట్స్ వాడేవారు ఎక్కువ ఎనర్జీని వినియోగించే లైట్లను కాకుండా తక్కువ ఎనర్జీని వినియోగించే ఎల్ఈడీ లైట్లను వాడితే బాగుంటుంది. గణపతి బ్యాగ్రౌండ్ లో స్వస్తిక్ సింబల్స్ కలిగి ఉన్న బట్టతో డెకరేషన్ చేస్తే గుడిలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. అలంకరణ కోసం పువ్వులను ఉపయోగించండి. పువ్వులతో ఒక్కసారిగా కొత్త అందం వస్తుంది.
మట్టి గణపతిని పూజించండి
అలంకరణ మొత్తం పర్యావరణ హితంగా చేసిన తర్వాత మట్టి గణపతిని పూజించండి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టి గణపతిని ఇంటికి తెచ్చుకోండి. లేదంటే మట్టి గణపతిని మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అలాగే మట్టి గణపతిని మీ ఊర్లో చెరువు ఉన్నట్లయితే అక్కడ నిమజ్జనం చేయండి. సిటీల్లో ఉన్నవారు గణపతిని ఒక బకెట్ నీళ్ళలో నిమజ్జనం చేయండి. ఆ తర్వాత ఆ బకెట్ లో మంచి మొక్కను నాటండి.