Foreign University: విదేశాల్లో ఉచితంగా చదువుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాల్లో చదివి, నాణ్యమైన విద్యను పొందాలని అనేక మంది విద్యార్థులు కలలు కంటారు.
అయితే, వివిధ కారణాల వల్ల వారు ఈ అవకాశాన్ని అందుకోలేరు. ముఖ్యంగా, అధిక ఫీజులు విద్యార్థులను భయపెడతాయి.
కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదివే అవకాశం ఇంట్లోనే పొందవచ్చని చాలామందికి తెలియదు.
ఆన్‌లైన్ కోర్సుల ద్వారా ఈ విశ్వవిద్యాలయాలు అందించే విద్యను సులభంగా అభ్యసించవచ్చు. మరి, అందుబాటులో ఉన్న ఈ కోర్సుల గురించి వివరంగా తెలుసుకుందాం!
వివరాలు
ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల ఉచిత ఆన్‌లైన్ కోర్సులు
ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి.
ఇవి విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలను పరిచయం చేయడమే కాకుండా, విద్యార్థులకు ప్రాథమిక జ్ఞానం అందించేందుకు ఉపకరిస్తాయి.
ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు తమ ఆసక్తి ఉన్న రంగాలలో ప్రాథమిక అంశాలను నేర్చుకోవచ్చు.
అంతేకాకుండా, విదేశీ విశ్వవిద్యాలయంలో చదివిన అనుభూతిని పొందటమే కాకుండా, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
ఇవి ప్రధానంగా ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా అందించబడతాయి, అంటే సంబంధిత విశ్వవిద్యాలయాల అధ్యాపకులే బోధిస్తారు.
వివరాలు
హార్వర్డ్ విశ్వవిద్యాలయం
ప్రపంచ ప్రఖ్యాత ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్ ఒకటి. ఈ విశ్వవిద్యాలయం దాదాపు 600కు పైగా ఉచిత కోర్సులను అందిస్తోంది.
అత్యున్నత విద్యా ప్రమాణాలతో, తమ బోధన విధానాన్ని పరిచయం చేసేలా ఈ కోర్సులు రూపొందించబడ్డాయి.
ఒక్క రోజు నుండి పన్నెండు వారాల వరకు అందుబాటులో ఉండే ఈ కోర్సుల్లో సాహిత్యం, చరిత్ర, న్యూరోసైన్స్, బిగ్‌డేటా, ప్రోగ్రామింగ్, గేమ్ డెవలప్‌మెంట్, నాయకత్వ నైపుణ్యాలు, మిషన్ లెర్నింగ్, పైథాన్ లాంగ్వేజ్, డేటా సైన్స్ వంటి అనేక అంశాలపై ప్రాథమిక అవగాహన పొందొచ్చు.
వివరాలు
జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఈ విద్యాసంస్థ మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ (MOOCs) ద్వారా 30కు పైగా ఆన్‌లైన్ కోర్సులను అందిస్తోంది.
ఇప్పటి వరకు 30 లక్షల మందికిపైగా విద్యార్థులు వీటి ప్రయోజనం పొందారు.
ఈ కోర్సులు వివిధ ర్యాంకింగ్ సిస్టమ్స్‌లో అగ్రస్థానాలను దక్కించుకున్నవే.
అందుబాటులో ఉన్న ముఖ్యమైన కోర్సుల్లో బిజినెస్, కంప్యూటింగ్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్, సప్లై చెయిన్ అండ్ లాజిస్టిక్స్ ఉన్నాయి.
వీటిలో డేటా అనలిటిక్స్, కమ్యూనికేషన్, యూజర్ ఎక్స్‌పీరియెన్స్ (UX) డిజైన్, పైథాన్, జావా, డేటా స్ట్రక్చర్స్, మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్, మెషిన్ డిజైన్, ఇన్నోవేషన్ లీడర్‌షిప్ వంటి కోర్సులు ప్రముఖమైనవి.
విద్యార్థులు edX, Coursera, Udacity వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
వివరాలు
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)
MITలో గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఇంజినీరింగ్, అర్బన్ స్టడీస్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్, ఆర్కిటెక్చర్, ఏరోనాటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, లింగ్విస్టిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, న్యూక్లియర్ సైన్స్ తదితర రంగాల్లో 3,000కి పైగా ఉచిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
వీటిలో డౌన్‌లోడ్ చేసుకుని చదివే కోర్సులు, ఇంటరాక్టివ్ విధానంలో లభించే కోర్సులు ఉన్నాయి.
వివరాలు
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
ఈ విశ్వవిద్యాలయం edX ప్లాట్‌ఫామ్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. 2012 నుండి 150 దేశాలకు చెందిన 40 లక్షల మంది విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరారు.
ఇక్కడ బిజినెస్ రైటింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఆంత్రప్రెన్యూర్‌షిప్, జర్నలిజం, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఈ కోర్సుల్లో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కావాలంటే కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు
మిషిగాన్ స్టేట్ విశ్వవిద్యాలయం
ఈ విశ్వవిద్యాలయం ఫొటోగ్రఫీ, మ్యూజిక్, గేమ్ డెవలప్‌మెంట్, స్క్రిప్ట్ రైటింగ్, జర్నలిజం, పిక్సల్ ఆర్ట్, క్రియేటివిటీ, బిజినెస్ వంటి ప్రత్యేక కోర్సులను అందిస్తోంది.
సంప్రదాయ విద్యకు భిన్నంగా, సృజనాత్మక విద్యను అభ్యసించేందుకు వీటిని రూపొందించారు.
ఈ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు కంప్లీషన్ సర్టిఫికెట్ లభిస్తుంది. వారానికి కావాల్సిన సమయాన్ని అనుసరించి వీటిని 6 నెలల్లో పూర్తిచేయొచ్చు.
వివరాలు
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది ఆర్ట్స్
ఈ కళల సంస్థ ద్వారా ఫ్రీలాన్సింగ్ బిజినెస్, గేమ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, మ్యూజిక్ థియరీ, పొయెట్రీ, యూఐ/యూఎక్స్ డిజైన్, వెబ్ డిజైన్ వంటి కోర్సులను Coursera ప్లాట్‌ఫామ్ ద్వారా చేయవచ్చు.
కొన్ని ప్రత్యేక కోర్సులకు క్రెడిట్స్ మరియు సర్టిఫికేట్లను పొందేందుకు ఫీజు చెల్లించాలి.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్
యునైటెడ్ కింగ్‌డమ్‌లో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి. తాజా QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది.
ఇందులో ఆంత్రోపాలజీ, సిటిజన్ సైన్స్, కల్చర్, హెల్త్ తదితర రంగాల్లో 170కు పైగా కోర్సులు ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రత్యేక కోర్సులకు మాత్రం ఫీజు చెల్లించాలి.
వివరాలు
జాబ్ మార్కెట్‌లో అత్యుత్తమ అవకాశాలు
విదేశీ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అభ్యసించాలనే కలను ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా సాకారం చేసుకోవచ్చు.
ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల ఉచిత కోర్సులను ఉపయోగించుకొని, అధునాతన అంశాలను నేర్చుకొని, జాబ్ మార్కెట్‌లో అత్యుత్తమ అవకాశాలను అందుకోవచ్చు!