LOADING...
Guilt feeling: చేసిన తప్పే మళ్లీ మళ్లీ గుర్తొస్తుందా? నిపుణుల సూచనలు ఇవే!
చేసిన తప్పే మళ్లీ మళ్లీ గుర్తొస్తుందా? నిపుణుల సూచనలు ఇవే!

Guilt feeling: చేసిన తప్పే మళ్లీ మళ్లీ గుర్తొస్తుందా? నిపుణుల సూచనలు ఇవే!

వ్రాసిన వారు Moogati Shabari
May 09, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాలాసార్లు కారణం ఉన్నా లేకపోయినా మనం కుటుంబ సభ్యులు లేదా స్నేహితులపై కోపంగా ప్రవర్తిస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మాటలతోనో, ప్రవర్తనతోనో వారిని నొప్పించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఆ సమయంలో మన చర్యలు సరైనవేనని అనిపించినా, కొంత సమయం గడిచిన తర్వాత మాత్రం "అలా చేయకుండా ఉండాల్సింది" అనే ఆలోచన మనసును వెంటాడుతుంది. చేసిన తప్పు గురించిన అపరాధ భావన మనసును కలవరపెడుతుంది. బాధపడుతున్నప్పటికీ, వెళ్లి క్షమాపణ చెప్పాలంటే సంకోచం అడ్డుకుంటుంది. ఇలా మనసులోనే మోస్తూ ఉండటం వల్ల మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అందుకే, ఈ భావన నుంచి బయటపడేందుకు నిపుణులు కొన్ని ఉపయోగకరమైన సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వివరాలు

పొరపాటు ఎందుకు జరిగిందో అర్థం చేసుకోండి

చాలామంది ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా కోపంతో ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు, తర్వాత తీవ్రంగా బాధపడుతుంటారు. అయితే, ముందుగా మనం చేసిన పని నిజంగా తప్పేనా? లేదా పరిస్థితుల ప్రభావంలో జరిగిందా? అనే విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మన భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోవచ్చు. మరికొన్ని సార్లు తెలియకుండానే పొరపాటు జరిగిపోతుంది. అందుకే జరిగిన సంఘటనను ఒకసారి గుర్తు చేసుకుని పరిశీలించడం అవసరం. అలా చేస్తే తప్పు ఎక్కడ జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. తద్వారా భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది అపరాధ భావన తగ్గేందుకు కూడా సహాయపడుతుంది.

వివరాలు

జరిగిన విషయాన్ని పదేపదే గుర్తుచేసుకోవద్దు..

ఏదైనా పొరపాటు జరిగితే దాన్నే మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ చాలామంది తమను తాము బాధపెట్టుకుంటుంటారు. కొన్నిసార్లు సంఘటన చిన్నదైనా, దాని వల్ల పెద్ద నష్టం జరగకపోయినా, చేసిన తప్పునే మనసులో తిరగేస్తూ బాధపడిపోతారు. అయితే, చిన్న విషయాలకే అతిగా ఆలోచించడం వల్ల మనసు పూర్తిగా నెగటివ్ భావాలతో నిండిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి, జరిగిన విషయాన్ని అవసరానికి మించి తలచుకోవడం మానుకోవడం మంచిదని చెబుతున్నారు.

Advertisement

వివరాలు

తప్పు జరిగితే క్షమాపణ చెప్పేందుకు వెనకాడొద్దు..

కొన్ని సందర్భాల్లో మనం అకారణంగా ఎవరికైనా నొప్పి కలిగిస్తే, వారికంటే మనమే ఎక్కువగా బాధపడుతుంటాం. అయినప్పటికీ, ఆ భావాలను బయటపెట్టలేక మౌనంగా ఉంటాం. వారి ముందుకు వెళ్లి మాట్లాడటానికీ సంకోచిస్తాం. దీంతో చేసిన తప్పు గురించిన బాధ మరింత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ భావాన్ని మనసులో దాచుకోవడం కంటే వెంటనే దూరం చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీరు ఎవరినైనా బాధపెట్టినట్లయితే, వారి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరండి. ఆ సమయంలో ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో నిజాయితీగా వివరించండి. అలాగే, మళ్లీ అలాంటి పొరపాటు చేయనని హామీ ఇవ్వండి. మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణను చాలామంది అర్థం చేసుకుంటారని, దీంతో మీ మనసు కూడా ప్రశాంతంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement