Broccoli Health Benefits : రోజూ బ్రకోలీ తింటే ఏం జరుగుతుంది? శరీరంలో జరిగే మార్పులను తెలుసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
కాలిఫ్లవర్, క్యాబేజ్‌లాగే బ్రకోలీ కూడా క్రూసిఫెరస్ కూరగాయల వర్గానికి చెందుతుంది. శరీరానికి అవసరమైన అనేక కీలక పోషకాలు సమృద్ధిగా ఉండటంతో దీనిని పోషకాల శక్తికేంద్రంగా నిపుణులు అభివర్ణిస్తుంటారు. పేగుల ఆరోగ్యం మెరుగుపరచడం నుంచి జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడం వరకు, బ్రకోలీ అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రకోలీ వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Details
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
బ్రకోలీలో విటమిన్ సి, బీటా కెరోటిన్, జింక్‌తో పాటు అనేక యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజువారీగా అవసరమైన విటమిన్ సి పరిమాణంలో 100 శాతం కంటే ఎక్కువను బ్రకోలీ అందిస్తుందని వారు వివరించారు. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే, ఇందులో సల్ఫోరాఫేన్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఇమ్యూనిటీని పెంచే మొక్కల సమ్మేళనం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బ్రకోలీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం, రక్తంలో చక్కెర నియంత్రణ, పేగుల సంరక్షణ, గుండె ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుందని Cleveland Clinic అధ్యయనం వెల్లడించింది.
Details
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
బ్రకోలీలోని ఫైబర్ పేగులోని పైత్య ఆమ్లాలతో కలిసిపోయి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటంతో రక్తనాళాలు రిలాక్స్‌గా ఉండేలా చేసి, ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇస్తుందని వివరిస్తున్నారు. విటమిన్ కె, ఫోలేట్ వంటి పోషకాలు రక్తనాళాలను దృఢంగా, అనువుగా ఉంచడంతో పాటు ధమనుల్లో ప్లేక్ పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయని పేర్కొంటున్నారు. క్రూసిఫెరస్ కూరగాయలు ఎక్కువగా తీసుకునే ఆహారం ప్లాస్మా LDL కొలెస్ట్రాల్ తగ్గుదలతో సంబంధం ఉందని National Library of Medicine అధ్యయనం వెల్లడించింది.
Details
మెదడు పనితీరుకు మేలు
బ్రకోలీ జ్ఞాన సంబంధిత పనితీరు, మానసిక స్పష్టత, దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో విటమిన్ సి, ఇ, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండటంతో మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, వయస్సుతో వచ్చే క్షీణతను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయని నిపుణులు వివరించారు. కోలిన్, విటమిన్ కె వంటి సమ్మేళనాలు న్యూరోట్రాన్స్‌మిటర్ పనితీరు, జ్ఞాపకశక్తి నిలుపుదల, ఏకాగ్రత పెంపునకు దోహదపడతాయని చెబుతున్నారు.
Details
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
బ్రకోలీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు బ్రకోలీ ద్వారా సుమారు 2.5 గ్రాముల ఫైబర్ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మలబద్ధకం నివారించి, క్రమమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. బ్రకోలీలో ఉన్న ప్రీబయోటిక్స్ ప్రయోజనకరమైన గట్ సూక్ష్మజీవులకు పోషణనిచ్చి, మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వివరించారు. అలాగే కాలేయం నుంచి విషపదార్థాలను బయటకు పంపడంలోనూ ఇది సహాయపడుతుందని చెబుతున్నారు.
Details
ఎముకలను బలోపేతం చేస్తుంది
బ్రకోలీ దృఢమైన, స్థిరమైన ఎముకలకు అవసరమైన కాల్షియం, విటమిన్ కె వంటి కీలక పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులోని విటమిన్ కె ఎముకల జీవక్రియలో కీలక పాత్ర పోషించి, ఎముకల నష్టాన్ని తగ్గించడంతో పాటు కాల్షియం శోషణను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముకల నిర్మాణానికి మద్దతు ఇస్తాయని పేర్కొంటున్నారు. బ్రకోలీలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కాలక్రమేణా ఎముకలను బలహీనపరచే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని వివరించారు.
Details
క్యాన్సర్‌తో పోరాడే శక్తి
బ్రకోలీలో అధికంగా ఉండే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం డీఎన్ఏలో వచ్చే మ్యుటేషన్లను నియంత్రించడం ద్వారా క్యాన్సర్‌ను అడ్డుకట్ట వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రకోలీని తక్కువగా లేదా అసలు తీసుకోని వారితో పోలిస్తే, ఎక్కువగా తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, కెరటెనాయిడ్స్ అనే పిగ్మెంట్లు జన్యుపరమైన వ్యాధులు, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. బ్రకోలీలో గ్లూకోసినోలేట్స్, సల్ఫోరాఫేన్, ఇండోల్-3 కార్బినాల్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉండి, ఇవన్నీ ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రోత్సహించే ప్రభావాలు కలిగి ఉన్నాయని National Library of Medicine అధ్యయనం స్పష్టం చేసింది.