Maha shivaratri Story: శివరాత్రి మహిమ ఏమిటి?.. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన రహస్యం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
మహా శివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజున భక్తులు నిష్ఠగా ఉపవాసం, రాత్రంతా జాగరణ, బిల్వార్చన, రుద్రాభిషేకం వంటి ఆచారాలు నిర్వహిస్తారు. అయితే శివరాత్రి రోజు ఈ విధమైన ఆచారాలను ఎందుకు చేయాలి? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి పార్వతీదేవి, "ప్రభూ, మనుషులు పాపాల వల్ల పునర్జన్మలు పొందుతున్నారు. వారు చేసిన పాపాలను పరిహరించుకుని, సన్మార్గంలో నడిచి, కైలాసానికి చేరుకునేలా సులభమైన మార్గం చెప్పండని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు, "విను, ఇది మహాశివరాత్రి మహిమను తెలియజేసే కథ అంటూ ప్రారంభించారు.
Details
బోయవాడి కథ
పూర్వకాలంలో ఒక అరణ్యంలో ఒక బోయవాడు జీవించేవాడు. వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు వేటకు వెళ్లిన అతనికి సాయంత్రం అయ్యే వరకు ఒక్క జంతువు కూడా చిక్కలేదు. నిరాశతో తిరిగి వస్తూ ఉండగా ఒక సరస్సు కనిపించింది. రాత్రి సమయంలో జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయేమోనని ఆశించి, సరస్సు పక్కన ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రాత్రి కావడంతో అతనికి నిద్ర వస్తోంది. మేల్కొని ఉండేందుకు చెట్టు మీద ఉన్న ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేస్తూ ఉన్నాడు. అతనికి 'శివ శివ' అని పలకడం అలవాటు. అలా శివనామ స్మరణ చేస్తూ ఆకులు కింద పడేస్తూనే ఉన్నాడు.
Details
బోయవాడిలో మార్పు
అర్ధరాత్రి సమయంలో ఒక ఆడ జింక నీళ్లు తాగడానికి వచ్చింది. బోయవాడు బాణం ఎక్కుపెట్టగా, ఆజింక తాను గర్భవతినని, తనను చంపడం అధర్మమని వేడుకుంది. దాని మాటలకు కదిలిపోయిన బోయవాడు దాన్ని వదిలేశాడు. కొద్దిసేపటికి మరో ఆడ జింక, ఒక మగ జింక, చివరకు ఒక జింక తన పిల్లతో కలిసి వచ్చి కూడా మానవ భాషలో మాట్లాడి, తిరిగి వస్తామని మాట ఇచ్చి వెళ్లిపోయాయి. బోయవాడు ఆశ్చర్యంతో వాటి కోసం వేచి ఉన్నాడు. ఉదయం సూర్యోదయం సమయానికి ఆ జింకలన్నీ ఇచ్చిన మాట ప్రకారం తిరిగి వచ్చి ముందుగా తమను చంపమని కోరాయి. వాటి నిజాయితీ, సత్యనిష్ఠ బోయవాడి మనసును మార్చేసింది.వెంటనే అతను వేట జీవనాన్ని విడిచిపెట్టి సన్మార్గాన్ని అనుసరిస్తానని సంకల్పించాడు.
Details
మోక్షప్రాప్తి - కైలాసానికి ఆహ్వానం
అదే సమయంలో దైవదూతలు ప్రత్యక్షమై బోయవాడిని కైలాసానికి ఆహ్వానించారు. తాను శివపూజ ఏమీ చేయలేదని అతను చెప్పగా, వారు ఇలా వివరించారు. ఈరోజు మహాశివరాత్రి. నీకు తెలియకుండానే ఉదయం నుంచి ఉపవాసం చేశావు. రాత్రంతా జాగరణ చేశావు. శివనామ స్మరణ చేశావు. చెట్టు ఎక్కేటప్పుడు నీ దగ్గర ఉన్న నీళ్లు కింద ఉన్న శివలింగంపై పడ్డాయి. నీవు తెంపిన ఆకులు బిల్వాకులుగా మారి శివార్చనగా మారాయి. ఈ పవిత్ర రాత్రి చేసిన ఈ క్రియల వల్ల నీకు శివానుగ్రహం లభించింది. ఈ కథ ద్వారా శివుడు పార్వతీదేవికి వివరించినది ఏమిటంటే—శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ, బిల్వార్చన, శివనామస్మరణ, రుద్రాభిషేకం చేసినవారి పాపాలు నివృత్తి చెంది, మోక్షానికి చేరువవుతారు.
Details
శివరాత్రి ప్రత్యేకత ఏమిటి?
శివరాత్రి ఎందుకు ప్రత్యేకమో తెలియజేసే నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి: 1. శివలింగ ఆవిర్భావం - బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారనే వివాదంలో, అనంతమైన అగ్నిశిఖర రూపంలో శివుడు శివలింగంగా ప్రత్యక్షమైన రాత్రి శివరాత్రి. 2. శివపార్వతుల వివాహం - శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన పవిత్ర రాత్రి. 3. తాండవ నృత్యం - శివుడు ఆనంద తాండవం చేసిన రోజు. 4. కాలకూట విషం సేవనం - క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కాలకూట విషాన్ని ప్రపంచ రక్షణ కోసం శివుడు సేవించి, కంఠంలో నిల్వచేసి 'నీలకంఠుడు'గా ప్రసిద్ధి చెందిన రాత్రి. ఈ అన్ని కారణాల వల్ల శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినంగా భావిస్తారు.