#SankranthiSpecial: సంక్రాంతి రోజున ఏం చేయాలి? ఎందుకు చేయాలి? శాస్త్రాలు చెప్పే అసలు కారణాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వచ్చాయంటే చాలామందికి పిండి వంటలు, కొత్త బట్టలు, సంబరాలే గుర్తుకొస్తాయి. కానీ పండుగ అంటే కేవలం భోజనం, అలంకారాలు మాత్రమే కాదు. వాటి వెనుక ఉన్న యదార్థమైన ఆధ్యాత్మిక భావాన్ని తెలుసుకుంటే, ఈ పండుగలను ఎంత పవిత్రమైన మనసుతో మన పూర్వీకులు ఏర్పాటు చేశారో అర్థమవుతుంది.
Details
భోగి అంటే ఏమిటి? భోగం అనుభవించే రోజు
భోగి అనే పదానికి అర్థం భోగాన్ని అనుభవించే రోజు. పౌష్య మాసంలో పౌష్య లక్ష్మి ఇంటికి ప్రవేశిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. పూర్వం ఎక్కువమంది వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఆరుగాలం కష్టపడి పంట పండించి, కోసి ఇంటికి తెచ్చుకున్నప్పుడు రైతుకు కలిగే ఆనందం అపారం. పంట ఇంటికి వచ్చిన సంతోషంతో విశ్రాంతి తీసుకుంటూ మానసిక ఆనందాన్ని పొందే ఆ దశనే శాస్త్రాలు 'ఆనంద గోవిందము' అని పేర్కొన్నాయి.
Details
తిథి లేని పండుగ.. భోగికి ఉన్న ప్రత్యేకత
సాధారణంగా ప్రతి పండుగకూ ఒక నిర్దిష్ట తిథి ఉంటుంది. కానీ భోగి మాత్రం ఏ తిథికీ చెందదు. దక్షిణాయనం ఏ రోజున ముగుస్తుందో, అదే రోజు భోగి. పంచాంగంలో ఈ ఒక్క పండుగకే ఈ మినహాయింపు ఉంటుంది. దక్షిణాయణం అంతా ఉపాసన కాలంగా శాస్త్రాలు పేర్కొంటాయి. ఆ కాలంలో భగవంతుడిని ఉపాసన చేస్తూ, ఆయన అనుగ్రహం లభించిన ఒక్క రోజైనా జీవితం లో పొందగలిగితే, అదే నిజమైన భోగం. అందుకే ఆ రోజును భోగి పండగగా వ్యవహరిస్తారు.
Details
ఉపాసన అంటే ఏమిటి?
ఉపాసన అనే పదానికి అర్థాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఉప అంటే దగ్గరగా, ఆసన అంటే కూర్చోవడం. అంటే దేవుడి విగ్రహం దగ్గర కూర్చోవడమే ఉపాసన కాదని, మనసులో భగవంతుడిని నిలుపుకోవడమే అసలైన ఉపాసన. అలా నిరంతరం ఉపాసన చేస్తే పరమాత్మ సంతోషించి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆ అనుగ్రహం లభించే రోజే భోగి. భోగికి ముందున్న నెల రోజుల పాటు చిన్నపిల్లలతో గొబ్బెమ్మలు చేయించడం సంప్రదాయం. గొబ్బెమ్మ అంటే లక్ష్మీ ఉపాసనకు ప్రతీక.
Details
సంక్రాంతి రోజు చేయాల్సిన ముఖ్యమైన ఆచారాలు
మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. కాలాన్ని దక్షిణాయణం, ఉత్తరాయణం అని రెండు భాగాలుగా విభజించారు. దక్షిణాయణంలో దేవతలు నిద్రిస్తారని, ఉత్తరాయణంలో మేల్కొంటారని శాస్త్ర విశ్వాసం. దేవతలు మేల్కొనే సమయం బ్రాహ్మీ ముహూర్తం, అంటే తెల్లవారుజామున మూడు గంటల వేళ. అందుకే ఉపనయనాలు, వివాహాలు, దేవతా ప్రతిష్ఠలు వంటి శుభకార్యాలు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే నిర్వహిస్తారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తరువాత మధ్యానం (మునక వేసి స్నానం చేయడం)కు విశేష ప్రాధాన్యం ఉంది. నదుల్లో లేదా పుష్కరణిలో తల మునిగేలా స్నానం చేయడం ఉత్తమమని శాస్త్రాలు చెబుతాయి.
Details
ఉత్తరాయణ పుణ్యకాల మహిమ
ఉత్తరాయణ పుణ్యకాలం జీవులకు, దేవతలకు, పితృ దేవతలకు కూడా అత్యంత ముఖ్యమైన సమయం. ఆ సమయంలో పఠించే ఒక స్తోత్రం, చేసే ఒక ప్రదక్షిణం, నమస్కారం కూడా మనల్ని రక్షిస్తాయని విశ్వాసం. ఈ కాలంలో దక్కే పుణ్యానికి మించిన అదృష్టం లేదని శాస్త్రోక్తి. సంక్రమణ రోజున వండిన మధుర పదార్థంలో కొంత భాగాన్ని అతిథులకు, లేదా ఏదైనా జీవికి పంచి సంతోషంగా భోజనం చేయడం అత్యంత పుణ్యప్రదం. అతిథి సత్కారం, దానధర్మాల ప్రాముఖ్యత అతిథిని గౌరవించడం, అభ్యాగతిని సత్కరించడం, భగవన్నామస్మరణ, పవిత్ర గ్రంథాల పఠనం, పెద్దల సేవ, గురు దర్శనం ఇవన్నీ అభ్యున్నతికి దారితీసే కార్యాలు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇవి మరింత ఫలప్రదమవుతాయి. అందుకే భోగి, సంక్రాంతి పండుగలు వరుసగా వస్తాయి.
Details
మకర సంక్రమణం-అయ్యప్ప స్వామి దర్శనం
మకర సంక్రమణం అనగానే అయ్యప్ప స్వామి జ్ఞాపకం వస్తుంది. ఈరోజున స్వామివారి సంపూర్ణ దర్శనం లభిస్తుందని నమ్మి లక్షలాది మంది భక్తులు జ్యోతి దర్శనం కోసం శబరిమల వెళ్తారు. గుమ్మడి దానం, పితృ కార్యాలు గుమ్మడిని దానం చేయడం అత్యంత విశిష్టమైన దానంగా శాస్త్రాలు పేర్కొంటాయి. **కుష్మాండ దానం** చేస్తే భూమిదానం చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈదానాన్ని పూజారులకు, బ్రహ్మచారులకు, దేవాలయంలో లేదా అవసరమున్న ఎవరికైనా ఇవ్వవచ్చు. గుమ్మడితో పులుసు వండటం కూడా ఆచారం. మరణించిన తండ్రి, తాతపేరుతో రెండు విస్తరాకులు పరిచి, వండిన పదార్థాలను నివేదన చేయాలి. వారి ఫోటోలు ఉంచి, వారి పేరుతో బట్టలు దానం చేయడం,ఎవరికైనా భోజనం పెట్టడం తద్దినాలు, తిథులు చేసే వారి సంప్రదాయం.
Details
బొమ్మలు, దాన ప్రక్రియ, సూర్య నడక
బొమ్మలు పెట్టే అలవాటు ఉన్నవారు బొమ్మలను అలంకరించి హారతి ఇవ్వవచ్చు. సంక్రమణ రోజున చేసే దానధర్మం అంటే కేవలం పితృ కార్యాలే కాదు—ఎవరికైనా ఏదైనా పంచడం కూడా పుణ్యకార్యమే. ఈ రోజున దేవతలు నిద్రలేస్తారని చెబుతారు. సూర్యుడు ఆరోగ్యకారకుడు. ఈ రోజు నుంచి ఆయన ఉత్తర దిశ వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. పూర్తిగా ఉత్తరం వైపుగా కాకుండా, ఉత్తర దిశకు వాలుతూ ఉదయిస్తాడు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పాలు పొంగించడం, చెరుకుగడతో కలపడం వంటి ఆచారాలు పెద్దగా ఉండవు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అవి విస్తృతంగా చేస్తారు. మన పూర్వీకులు ఏ విధంగా పాటించారో, అదే విధంగా ఆచరించడమే ధర్మమని శాస్త్రోక్తి.