Papaya: బొప్పాయిని ఎప్పుడు తినాలి? ఈ విషయం తెలియకపోతే ప్రమాదమే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకృతి మనకు అందించిన అత్యంత పోషకమైన పండ్లలో బొప్పాయి ఒకటి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ పండును నిజంగానే పోషకాల భాండాగారం అని చెప్పొచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించడానికి చాలా మంది బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటారు. అయితే ఈ పండును ఎప్పుడు తింటే పూర్తి ప్రయోజనం లభిస్తుందో చాలా మందికి తెలియదు. దీనిపై నిపుణులు చెప్పే ముఖ్యమైన విషయాలు ఇవి.
Details
సరైన సమయం ఏది?
బొప్పాయిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్‌తో పాటు విటమిన్ A, C, B-కాంప్లెక్స్, E, K వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పూర్తిగా అందాలంటే బొప్పాయిని ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహార సమయంలో తీసుకోవడం ఉత్తమం. ఇలా తింటే జీర్ణవ్యవస్థ రోజంతా చురుకుగా పనిచేస్తూ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. రాత్రి సమయంలో తినాలంటే... పేగులను శుభ్రపరచడానికి రాత్రిపూట కూడా బొప్పాయిని తినవచ్చు. అయితే భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం మంచిది కాదు. భోజనం చేసిన తర్వాత పండ్లు తినాలంటే కనీసం 3 నుంచి 4 గంటల విరామం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Details
జీర్ణక్రియకు మేలు
బొప్పాయిలో ఉండే 'పపైన్' అనే ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది సహజమైన ఉపశమనం ఇస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ C శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచే కవచంలా పనిచేస్తుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి మంచిది బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అతిగా తినడం తగ్గి, బరువు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది.
Details
గుండె ఆరోగ్యం - చర్మ సౌందర్యం
బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై వచ్చే ముడతలు, మొటిమలు, నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా తింటే చర్మానికి సహజమైన కాంతి వస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.